స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో కొత్త రూల్స్‌ వచ్చాయ్‌.. ఇది తప్పనిసరి!

Imei Registration Number Must Before Mobile Sale Says Dot - Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్ల అమ్మకానికి ముందే ఐఎంఈఐ నంబర్‌ నమోదు తప్పనిసరి చేస్తూ టెలికం శాఖ ఆదేశాలు వెలువరించింది. 2023 జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. దేశీయంగా తయారైన లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్స్‌కూ ఈ నిబంధన వర్తిస్తుంది. అమ్మకానికి ముందే టెలికం శాఖకు చెందిన ఇండియన్‌ కౌంటర్‌ఫీటెడ్‌ డివైస్‌ రెస్ట్రిక్షన్‌ పోర్టల్‌ నుంచి ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్‌ ధ్రువీకరణ పొందాల్సిందే. ప్రతి మొబైల్‌కూ 15 అంకెల ఐఎంఈఐ సంఖ్య ఉంటుంది.

మొబైల్‌ పరికరాల గుర్తింపు సంఖ్యను తారుమారు చేయడాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెలికం నెట్‌వర్క్‌లో ఒకే ఐఎంఈఐతో నకిలీ పరికరాలు ఉండటం వల్ల పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లను ట్రాక్‌ చేయడం సాధ్యం కావడం లేదు. కోల్పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్‌ ఫోన్లను బ్లాక్‌ చేయడానికి, ట్రేస్‌ చేయడానికి సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అలాంటి హ్యాండ్‌సెట్ల విస్తరణను అరికట్టడానికి నకిలీ పరికరాల నియంత్రణకై ఇండియన్‌ కౌంటర్‌ఫీటెడ్‌ డివైస్‌ రెస్ట్రిక్షన్‌ వ్యవస్థను జోడించింది. దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్స్‌ను నిరోధించే సౌకర్యం మాత్రమే ప్రస్తుతం పోర్టల్‌లో అందుబాటులో ఉంది.   

చదవండి: బ్లాక్‌ బస్టర్‌ హిట్‌: రికార్డు సేల్స్‌, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top