ఐడీబీఐ బ్యాంక్‌ టర్న్‌అరౌండ్‌

IDBI Bank Back in Black in FY21 After 5 Years, Posts Profit of Rs 1,359 Crore - Sakshi

ఐదేళ్ల తదుపరి గతేడాది లాభాల్లోకి

క్యూ4లో రూ. 512 కోట్ల నికర లాభం

ఆర్‌బీఐ పీసీఏ నుంచి వెలుపలికి

ముంబై: ప్రయివేట్‌ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది.  రూ. 1,359 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) రూ. 12,887 కోట్ల నికర నష్టం నమోదైంది. వెరసి ఐదేళ్ల తరువాత టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. ఇక గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో నికర లాభం 4 రెట్లు ఎగసి రూ.512 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 135 కోట్లు మాత్రమే ఆర్జించింది. 

2017 మేలో ఆర్‌బీఐ విధించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి సైతం మార్చిలో బయటపడినట్లు ఎల్‌ఐసీ నియంత్రణ లోని ఐడీబీఐ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్‌ అనుసరించిన టర్న్‌అరౌండ్‌ వ్యూహాలు ట్రాన్స్‌ఫార్మేషన్‌కు బాటను ఏర్పరచినట్లు బ్యాంక్‌ తెలియజేసింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 38 శాతం ఎగసి రూ. 3,240 కోట్లకు చేరింది.  నికర వడ్డీ మార్జిన్లు 1.34 శాతం బలపడి 5.14 శాతానికి చేరాయి. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 166 కోట్ల నుంచి రూ. 548 కోట్లకు జంప్‌ చేసింది.  ఈ మార్చి త్రైమాసికంతో కలిపి వరుసగా ఐదు క్వార్టర్లపాటు బ్యాంకు లాభాలు ఆర్జించినట్లు ఐడీబీఐ ఎండీ, సీఈవో రాకేష్‌ శర్మ వివరించారు.

ఎన్‌పీఏలు తగ్గాయ్‌: మార్చికల్లా ఐడీబీఐ బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 27.53% నుంచి 22.37%కి బలహీనపడ్డాయి. ఇదే విధంగా నికర ఎన్‌పీఏలు 4.19% నుంచి 1.97%కి భారీగా తగ్గాయి.  అయితే మొండి ప్రొవిజన్లు రూ. 1,738 కోట్ల నుంచి రూ. 2,367 కోట్లకు పెరిగాయి. కోవిడ్‌  సెకండ్‌ వేవ్‌కుగాను రూ. 500 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టినట్లు బ్యాంకు తెలియజేసింది. టైర్‌–1 పెట్టుబడులు 13.06%కి, సీఆర్‌ఏఆర్‌ 15.59 శాతానికి మెరుగుపడినట్లు బ్యాంక్‌ పేర్కొంది. క్యూ4లో తాజా మొండిబాకీలు రూ. 2,281 కోట్లకు చేరగా.. రికవరీలు రూ. 1,233 కోట్లుగా నమోదయ్యాయి.
ఫలితాల నేపథ్యంలో బ్యాంక్‌ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 36.25 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top