దేశంలో కాస్ట్‌లీ ప్రాపర్టీలలో హైదరాబాద్‌ ర్యాంక్‌ ఎంతంటే..

Hyderabad now 2nd most expensive residential property - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గృహాలు ప్రియమయ్యాయి. దేశంలో అత్యంత ఖరీదైన ఇళ్లలో భాగ్యనగరం రెండవ స్థానానికి చేరింది. ఇక్కడ చ.అ. ధర రూ.5,800 నుంచి 6,000లుగా ఉన్నాయి. కాస్ట్‌లీ గృహాలలో తొలి స్థానంలో నిలిచిన ముంబైలో చ.అ. ధర రూ.9,600–9,800గా ఉన్నాయి. ప్రాపర్టీల వార్షిక ధరల వృద్ధిలోనూ హైదరాబాద్‌ ముందుంది. అహ్మదాబాద్‌లో 8 శాతం పెరుగుదల ఉండగా.. నగరంలో 6 శాతంగా ఉంది.

ప్రాపర్టీ బ్రోకరేజ్‌ సంస్థ ప్రాప్‌టైగర్‌.కామ్‌ ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశంలోని ప్రధాన నివాస విభాగ మార్కెట్లలో ధరల వృద్ధిని విశ్లేíÙంచింది. గతేడాది క్యూ3తో పోలిస్తే 2021 మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో చ.అ. ధర 3 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతమిక్కడ చ.అ.కు సగటు ధర రూ.5,751గా ఉంది. అత్యంత ఖరీదైన ప్రాపర్టీ మార్కెట్‌గా ముంబైలో నిలిచింది. ఇక్కడ చ.అ. సగటు ధర రూ.9,670గా ఉంది.

విక్రయాలు ఎక్కువగా ఎక్కడంటే..
గత పదేళ్ల నుంచి గృహ రుణ వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉండటం, డెవలపర్లు ప్రత్యేక రాయితీలు అందిస్తుండటంతో నగరంలో గృహ కొనుగోళ్లు పెరిగాయి. ఐటీ, ఫార్మా హబ్‌లతో ఇతర నగరాల నుంచి కూడా విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. హైదరాబాద్‌లో ధర ర్యాలీ కొనసాగుతున్నప్పటికీ గృహాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్‌లో 7,812 గృహాలు విక్రయమయ్యాయి. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 222 శాతం, గతేడాది క్యూ3తో పోలిస్తే 140 శాతం వృద్ధి రేటు. బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్‌ వంటి ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగాయి.

నగరంలో ఇన్వెంటరీ 50,103 యూనిట్లు..
గృహాలకు డిమాండ్‌ పెరగడంతో అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) నిర్వహణకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం నగరంలో 50,103 గృహాల ఇన్వెంటరీ ఉంది. వీటి నిర్వహణకు 25 నెలల కాలం పడుతుంది. కోల్‌కతాలో అతి తక్కువ ఇన్వెంటరీ (26,382 యూనిట్లు) ఉన్నప్పటికీ.. వీటి నిర్వహణకు మాత్రం 32 నెలల సమయం పడుతుంది. ముంబైలో 2,61,385 ఇన్వెంటరీ ఉంది. అహ్మదాబాద్‌లో 51,208, బెంగళూరులో 67,644, చెన్నైలో 35,145, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 1,00,559, పుణేలో 1,28,093 ఇన్వెంటరీ గృహాలున్నాయి.

లాంచింగ్స్‌లోనూ జోరే
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కొత్త గృహాల ప్రారంభాలు కూడా జోరుగానే సాగాయి. హైదరాబాద్‌లో క్యూ3లో 12,342 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. గతేడాది క్యూ3తో పోలిస్తే 189 శాతం వృద్ధి. 2021 క్యూ3లోని లాంచింగ్‌ యూనిట్లలో 36 శాతం రూ. కోటి ధర ఉన్న గృహాలున్నాయి. దుండిగల్, తెల్లాపూర్, గోపన్‌పల్లి, బాచుపల్లి, బండ్లగూడ జాగీర్‌లలో ఎక్కువగా లాంచింగ్స్‌ జరిగాయి.  

వృద్ధి ఎందుకంటే..
డిమాండ్, సరఫరాల మధ్య తేడాలు గమనిస్తే హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌ రికవరీ దశకు చేరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సిమెంట్, స్టీల్‌ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. పండుగ సీజన్లలో కొనుగోలుదారులపై ధరల పెంపు ప్రభావాన్ని లేకుండా ఉండేందుకు డెవలపర్లు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీంతో రానున్న త్రైమాసికాలలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాలలో గృహ విభాగంలో స్థిరమైన వృద్ధి నమోదవుతుంది.
– రాజన్‌ సూద్, బిజినెస్‌ హెడ్, ప్రాప్‌టైగర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top