‘హరిత’ వాహనాలపై బిలియన్‌ డాలర్లు

Hindustan Zinc to invest 1billion dollers to replace diesel vehicles - Sakshi

అయిదేళ్లలో హెచ్‌జెడ్‌ఎల్‌ ప్రణాళికలు

న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో డీజిల్‌ ఆధారిత మైనింగ్‌ వాహనాలను బ్యాటరీ ఆపరేటెడ్‌ వాహనాలుగా మార్చుకునేందుకు 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 8,270 కోట్లు) పైగా వెచ్చించనున్నట్లు, పూర్తి స్థాయిలో హరిత ఇంధనాల వైపు మళ్లనున్నట్లు హిందుస్తాన్‌ జింక్‌ సీఈవో అరుణ్‌ మిశ్రా తెలిపారు. తమకు 900 మైనింగ్‌ వాహనాలు ఉండగా ఇప్పటికే నాలుగింటిని ప్రయోగాత్మకంగా బ్యాటరీలతో నడిపిస్తున్నట్లు ఆయన వివరించారు.
2050 నాటికి పూర్తి కర్బన ఉద్గారాల రహిత సంస్థగా ఎదిగే దిశగా 200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు ఇటీవలే సెరెంటికా సంస్థతో పాతికేళ్ల పవర్‌ పర్చేజ్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిశ్రా చెప్పారు. దీనితో 1.2 మిలియన్‌ టన్నుల మేర కర్బన ఉద్గారాలను నివారించవచ్చన్నారు. 2024 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్‌ వినియోగాన్ని 40 శాతం మేర, 2027 పూర్తిగా తగ్గించుకోవాలని ప్రణాళికలు ఉన్నట్లు మిశ్రా వివరించారు. అలాగే రాజస్థాన్‌లోని చందేరియాలో రూ. 2,500 కోట్లతో 0.5 మిలియన్‌ టన్నుల డీఏపీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.  

వేదాంత గ్రూప్‌ సంస్థ అయిన హెచ్‌జెడ్‌ఎల్‌లో ప్రభుత్వానికి 29 శాతం వాటాలు, ముగ్గురు బోర్డు సభ్యులు ఉన్నారు. ఈ వాటాలను ప్రభుత్వం త్వరలోనే పూర్తిగా విక్రయించనుందని, అయితే నిర్దిష్ట కాలవ్యవధేమీ లేదని మిశ్రా వివరించారు. దీనిపై ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసినట్లు ఆయన చెప్పారు. జింక్‌ తయారీలో హెచ్‌జెడ్‌ఎల్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. దేశీయంగా వెండిని తయారు చేసే ఏకైక సంస్థగాను, జింకు..సీసం అత్యధికంగా తయారు చేసే కంపెనీగాను కార్యకలాపాలు సాగిస్తోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top