జోరందుకున్న కార్మికుల నియామకం | Sakshi
Sakshi News home page

జోరందుకున్న కార్మికుల నియామకం

Published Thu, Apr 15 2021 7:59 AM

 Healthcare, e-commerce IT to drive job creation in Q1: TeamLease - Sakshi

సాక్షి, ముంబై: వేగంగా కొనసాగుతున్న టీకాల కార్యక్రమం.. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న అశావహ అంచనాల మధ్య.. 70 శాతం సంస్థలు కార్మికుల నియామకాలను (బ్లూకాలర్‌ వర్కర్స్‌) ఇప్పటికే ప్రారంభించాయి. ఓఎల్‌ఎక్స్‌ సంస్థ ఓఎల్‌ఎక్స్‌ పీపుల్‌ సర్వే పేరుతో ఒక సర్వే నిర్వహించి వివరాలను విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో 150 కంపెనీల అధిపతులు పాల్గొని అభిప్రాయాలు తెలియజేశారు.  (షాపింగ్‌ మాల్స్‌కు ‌కరోనా సెకండ్‌ వేవ్‌ షాక్‌!)

సర్వే ఫలితాలు.. 

  • రెండో ఎడిషన్‌ సర్వేలో భాగంగా 16 శాతం కంపెనీలు తాము కార్మికుల నియామకాలను నూరు శాతం ప్రారంభించినట్టు చెప్పగా.. మరో 54 శాతం కంపెనీలు తాము 50 శాతం మేరే కార్మికులను నియమించుకుంటున్నట్టు వెల్లడించాయి. 
  • కరోనా కేసులు తిరిగి పెరిగిపోతున్న నేపథ్యంలో మెజారిటీ కాంట్రాక్టు పనివారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. నైపుణ్య మానవవనరుల పరంగా సవాళ్లను ఎదుర్కోవడం లేదని 60 శాతం కంపెనీలు తెలిపాయి. 
  • సర్వేలో పాల్గొన్న ప్రతీ ఇద్దరిలో ఒకరు ఏడాదిలోపే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశావహంతో ఉన్నారు. 36 శాతం మంది మాత్రం అనిశ్చితిని వ్యక్తం చేస్తూ ఆర్థిక వ్యవస్థ నిదానంగా కోలుకోవచ్చన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. 
  • తమ వ్యాపారాలు చక్కగా నడుస్తున్నాయంటూ 60 శాతం మంది చెప్పారు. 2021 చివరికి గానీ తమ వ్యాపారాలు సాధారణ స్థితికి చేరుకోవని 24 శాతం చెప్పారు. 
  • ఈకామర్స్, లాజిస్టిక్స్‌ రంగాల్లో నియామకాలు పూర్తి స్థాయికి చేరుకోగా.. ఎఫ్‌ఎంసీజీ, బీఎఫ్‌ఎస్‌ఐ, తయారీ, ఐటీలోనూ డిమాండ్‌ నెలకొంది. 
  • ఉద్యోగుల సంక్షేమ విషయానికొస్తే.. 52 శాతం సంస్థలు పీఎఫ్, గ్రాట్యుటీ ప్రయోజనాలను అందిస్తుంటే, 44 శాతం సంస్థలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను సైతం ఆఫర్‌ చేస్తున్నాయి. మరో 33 శాతం సంస్థలు కార్మికుల్లో నైపుణ్యాల పెంపునకు పెట్టుబడులపై ఆసక్తితో ఉన్నాయి. (భారీగా పెరిగిన మొబైల్‌ మాల్వేర్‌ దాడులు)


7 శాతం పెరగొచ్చు: జూన్‌ త్రైమాసికంపై టీమ్‌లీజ్‌ అంచనా 
ఉద్యోగ నియామకాలు ప్రస్తుత త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 7 శాతం వరకు పెరగొచ్చని (జనవరి–మార్చితో పోలిస్తే) టీమ్‌లీజ్‌ ఎంప్లాయిమెంట్‌ అవుట్‌లుక్‌ నివేదిక తెలియజేసింది. మరింత లాక్‌డౌన్‌లు లేకుండా, పని ప్రదేశాల్లో నిబంధనలను విధించకుండా ఉంటేనే ఈ మేరకు వృద్ధి ఉంటుందని నివేదికలో అంచనా వేసింది. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, విద్యా సేవలు, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, ఐటీ రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 21 రంగాలను సమీక్షించగా.. 8 రంగాలు ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను నియమించుకునే ఉద్దేశంతో ఉన్నట్టు టీమ్‌లీజ్‌ నివేదిక తెలిపింది. 712 చిన్న, మధ్య, భారీ స్థాయి కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. కాగా, ఈ ఏడాది మార్చిలో ఉద్యోగాల భర్తీ ఫిబ్రవరి నెలతో పోలిస్తే 2 శాతం తగ్గినట్టు మాన్‌స్టర్‌ డాట్‌ కామ్‌ తన నివేదికలో తెలిపింది. (ఈ–కామర్స్‌కు కరోనా జోష్‌..!)

Advertisement
 
Advertisement