‘కంపెనీ వీడితే బోనస్‌లు ఇచ్చాకే బయటకు వెళ్లండి’.. ఉద్యోగులకు హెచ్‌సీఎల్‌ కండిషన్‌!

HCL Bonus Return Policy Revoked For Resigned Employees Create Confusion - Sakshi

దేశంలోనే నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీని ఏడాది మధ్యలో వీడుతున్న ఉద్యోగులను.. బోనస్‌ కింద చెల్లించిందంతా తిరిగి ఇచ్చేయమంటూ వేధిస్తోందన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటన ఇచ్చుకుంటున్నప్పటికీ.. అది ఉద్యోగులకు పూర్తి ఊరట ఇచ్చేదిగా లేదని తెలుస్తోంది!. 

తాజాగా భారత ఐటీ కంపెనీలు డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెసీఎల్‌పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజైన్‌లు చేసి కంపెనీని వీడుతున్న ఉద్యోగులను ‘పర్‌ఫార్మెన్స్‌ బోనస్‌’ ఇచ్చిందంతా..  తిరిగి చెల్లించాకే బయటకు వెళ్లాలని కోరుతోంది. ఈ మేరకు హెచ్‌ఆర్‌ పాలసీలోని రూల్‌ను చూపించడంతో ఉద్యోగులు ఖంగుతింటున్నారు. 


ఈ విషయంపై ఐటీ ఎంప్లాయిస్‌ యూనియన్లను ఉద్యోగులు ఆశ్రయించినట్లు సమాచారం. లేబర్‌ మినిస్టర్‌ భూపేందర్‌ యాదవ్‌కి, హెచ్‌సీఎల్‌ చైర్‌పర్సన్‌కి సైతం లేఖలు రాశారు పుణే ఐటీ యూనియన్‌ ప్రతినిధి హర్మీత్‌ సలూజ. డబ్బులు తిరిగి చెల్లించని ఉద్యోగుల ఎక్స్‌పీరియెన్స్‌ సర్టిఫికెట్లు, రిలీవింగ్‌ లెటర్లు ఇవ్వకుండా కంపెనీ వేధిస్తోందని సలూజ ఆ లేఖలో ప్రస్తావించారు. 

హెచ్‌సీఎల్‌ ప్రకటన
అయితే హెచ్‌సీఎల్‌ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. ఉద్యోగులకు తెలియకుండా తామేం చేయట్లేదని పేర్కొంది. మంత్లీ బేసిస్‌ మీద చెల్లించే అడ్వాన్స్‌ విషయంలో హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం.. అదీ ఉద్యోగులు సంతకాలు చేసిన కాలమ్‌ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేసింది. నవంబర్‌ 2021న ఉద్యోగులకు పంపిన మెయిల్‌ ప్రకారం.. సెప్టెంబర్‌ 1, 2021 నుంచి మార్చ్‌ 31, 2022 మధ్య కంపెనీని వీడే ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ల నుంచి.. ఎంప్లాయి పర్‌ఫార్మెన్స్‌ బోనస్‌ (EFB) రికవరీ చేస్తామని తెలిపింది. ఇక వివాదాస్పదం కావడంతో ఆఘమేఘాల మీద ఆ పాలసీని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది.

వెనక్కి తగ్గలేదు!
వివాదాస్పద ఈ పాలసీ విషయంలో హెచ్‌సీఎల్‌ ఒక స్పష్టమైన ప్రకటనంటూ ఇవ్వకపోవడం గమనార్హం.  దశాబ్దానికి పైగా జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులు జీతం కాకుండా.. అడ్వాన్స్‌గా చెల్లింపులు అందుకుంటున్నారు.  అలాగే ఇకపై కంపెనీ మా ఉద్యోగుల కోసం ముందస్తు వేరియబుల్ చెల్లింపును కొనసాగిస్తుంది. అంతేకాదు డిసెంబర్ 22, 2021 నుంచి రికవరీలను కూడా మాఫీ చేసిందని హెచ్‌సీఎల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కానీ, ఇక్కడే గందరగోళం నెలకొంది. ఈఎఫ్‌బీ రికవరీ పాలసీని మాత్రమే హెచ్‌సీఎల్‌ వెనక్కి తీసుకుందని.. ఏపీఎంబీ (Advance Monthly Performance Bonus) విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సలూజ చెప్తున్నారు. ఈఎఫ్‌బీ అనేది ఉద్యోగులందరికీ వర్తించే బోనస్‌ కాగా.. ఏఎంపీబీ మాత్రం ప్రత్యేకించి ప్రాజెక్టుల కోసం పని చేసే ఉద్యోగులందరికీ జారీ చేస్తున్న బోనస్‌. సో.. రిజైన్‌ చేసిన ఉద్యోగులు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న మాట!.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top