
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 7 నుంచి మొదలు కానున్నది. ఈ నెల 9వ తేదీన ముగిసే ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.165–166 గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా రూ.110 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) కింద 3.56 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. మొత్తం మీద ఐపీఓ సైజు రూ.750–800 కోట్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా. కనీసం 90 ఈక్విటీ షేర్లకు (మార్కెట్ లాట్) దరఖాస్తు చేయాలి. ఈ నెల 17వ తేదీన స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్(ఇండియా) వ్యవహరిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.714 కోట్ల ఆదాయం ఆర్జించామని, కంపెనీలో 2,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని కంపెనీ తెలిపింది.