హురూన్‌ జాబితాలో 19 ఏళ్ల వ్యాపారవేత్త

Grocery delivery start-up Zepto Founder Kaivalya Vohra is the youngest richest Indian  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా సంపన్నుల జాబితా–2022లో రూ.10,94,400 కోట్ల సంపదతో గౌతమ్‌ అదానీ, కుటుంబం తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. రూ.7,94,700 కోట్లతో ముకేశ్‌ అంబానీ, కుటుంబం రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలను వరుసగా రూ.2,05,400 కోట్లతో సైరస్‌ ఎస్‌ పూనావాలా కుటుంబం (సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా), రూ.1,85,800 కోట్లతో శివ్‌ నాడార్‌ కుటుంబం (హెచ్‌సీఎల్‌), రూ.1,75,100 కోట్లతో రాధాకిషన్‌ దమానీ, కుటుంబం (అవెన్యూ సూపర్‌మార్ట్స్‌) దక్కించుకుంది. రూ.1,000 కోట్లకుపైగా సంపద కలిగిన వ్యాపారవేత్తలతో ఈ జాబితా తయారైంది. ఇందులో దేశవ్యాప్తంగా 1,103 మంది చోటు సంపాదించారు. గతేడాదితో పోలిస్తే 96 మంది కొత్తగా చేరారు. లిస్ట్‌లో స్థానం పొందిన వ్యాపారవేత్తల మొత్తం సంపద రూ.100 లక్షల కోట్లకు చేరుకుంది. 19 ఏళ్ల యువ వ్యాపారవేత్త, జెప్టో ఫౌండర్‌ కైవల్య వోరా జాబితాలో ఉన్నవారిలో పిన్న వయస్కుడు.  

తెలుగు రాష్ట్రాల నుంచి..
జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 78 మంది చోటు సంపాదించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. రూ.56,200 కోట్ల సంపదతో మురళి దివీ, కుటుంబం (దివీస్‌ ల్యాబొరేటరీస్‌) మొదటి స్థానంలో ఉంది. రూ.39,200 కోట్లతో బి.పార్థ సారధి రెడ్డి, కుటుంబం (హెటిరో ల్యాబ్స్‌) రెండవ స్థానం కైవసం చేసుకుంది. రూ.16,000 కోట్లతో ఎం.సత్యనారాయణ రెడ్డి కుటుంబం (ఎంఎస్‌ఎన్‌ ల్యాబొరేటరీస్‌), రూ.15,000 కోట్లతో జి.అమరేందర్‌ రెడ్డి, కుటుంబం (జీఏఆర్‌), రూ.13,300 కోట్లతో రామేశ్వర్‌రావు జూపల్లి కుటుంబం (మై హోమ్‌ ఇండస్ట్రీస్‌) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూ.12,600 కోట్లతో పి.పిచ్చిరెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌) ఆరవ స్థానం, రూ.12,100 కోట్లతో పి.వి.కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌) ఏడవ స్థానం, రూ.11,300 కోట్లతో కె.సతీష్‌ రెడ్డి, కుటుంబం (డాక్టర్‌ రెడ్డీస్‌) ఎనిమిదవ స్థానం, రూ.9,000 కోట్లతో వెంకటేశ్వర్లు జాస్తిని కుటుంబం (సువెన్‌ ఫార్మా) తొమ్మిదవ స్థానం, రూ.8,700 కోట్లతో మహిమ దాట్ల కుటుంబం (బయాలాజికల్‌–ఇ) 10వ స్థానంలో నిలిచారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top