చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనల్లో మార్పులు

Govt relaxes norms for various small savings schemes - Sakshi

ఎస్‌సీఎస్‌ఎస్, టైమ్‌ డిపాజిట్లకు వర్తింపు

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలలో కొన్నింటికి సంబంధించినిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు తెచి్చంది. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), టైమ్‌ డిపాజిట్ల పథకాల నిబంధనల్లో మార్పులు చేసింది. నూతన నోటిఫికేషన్‌ ప్రకారం.. పదవీ విరమణ ప్రయోజనాలు (నిధులు) చేతికి అందిన రోజు నుంచి మూడు నెలల వరకు ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతా ప్రారంభించడానికి అవకాశం లభించింది.

ఇప్పటి వరకు ఇది ఒక నెలగానే అమల్లో ఉంది. 55 ఏళ్ల నుంచి 60 ఏళ్లు దాటని వారికే ఇది వర్తిస్తుంది. ఎస్‌సీఎస్‌ఎస్‌ డిపాజిట్‌ ఐదేళ్ల కాల వ్యవధి ముగిసిన అనంతరం రెన్యువల్‌ చేసుకునే వారికి అప్పుడు అమల్లో ఉన్న వడ్డీ రేటును అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి (కేంద్ర, రాష్ట్ర) అయి, 50 ఏళ్లు నిండిన అనంతరం మరణించినట్టయితే, అప్పుడు వచ్చే ప్రయోజనాలను జీవిత భాగస్వామి ఎస్‌సీఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టి ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే డిపాజిట్‌లో ఒక శాతాన్ని మినహాయిస్తారు.

ఎస్‌సీఎస్‌ఎస్‌ డిపాజిట్‌ను ఐదేళ్లు ముగిసిన తర్వాత మరో మూడేళ్ల కాలానికి రెన్యువల్‌ చేసుకోవచ్చు. ఇక నుంచి అలా ప్రతి మూడేళ్లకోసారి రెన్యువల్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు. అలాగే, పీపీఎఫ్‌ ఖాతాను ముందస్తుగా మూసివేయడానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్‌ను నాలుగేళ్లు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకుంటే, పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాకు అమలయ్యే వడ్డీ రేటునే చెల్లిస్తారు. ప్రస్తుతం నాలుగేళ్ల తర్వాత ఉపసంహరించుకుంటే మూడేళ్ల కాలానికి అమలయ్యే రేటును ఇస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top