విలువైన పెట్టుబడికి మార్గం..ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌

Get Detailed Icici Prudential Value Discovery Fund Growth Portfolio - Sakshi

ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు చూస్తున్నాం. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికే సెంట్రల్‌ బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆర్‌బీఐ, ఫెడ్‌ సహా అన్ని ప్రముఖ సెంట్రల్‌ బ్యాంకులు రేట్ల పెంపు బాటలోనే దూకుడుగా వెళుతున్నాయి. కరోనా సమయంలో ఇచ్చిన ఉద్దీపనలను వెనక్కి తీసుకుంటున్నాయి.

ఇవన్నీ ఈక్విటీలకు ప్రతికూలతలే. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లను చురుగ్గా పెంచాల్సిందేనని, అవసరమైతే వృద్ధి రేటును కూడా త్యాగం చేయాల్సి రావచ్చని ఫెడ్‌ చైర్మన్‌ జీరోమ్‌ పావెల్‌ పేర్కొనడాన్ని గమనించాలి. కనుక సమీప భవిష్యత్తులో మార్కెట్లు అస్థిరతలను చూడనున్నాయి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ తరహా ప్రతికూల పరిస్థితులు ఎంతో అనుకూలం. ఈ దశలో వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించడం మెరుగైన ఆప్షన్‌ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విభాగంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌ను పరిశీలించొచ్చు.  

పెట్టుబడుల విధానం.. 
వడ్డీ రేట్లు పెరిగే తరుణం కనుక ఖరీదైన వ్యాల్యూషన్లతో ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడి రిస్క్‌ అవుతుంది. ఈ తరుణంలో అంతర్గత విలువ కంటే తక్కువలో లభించే నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వ్యాల్యూ ఫండ్స్‌ను ఆకర్షణీయంగా భావించొచ్చు. పెట్టుబడులకు ముందు ఆయా కంపెనీల పుస్తక విలువ, క్యాష్‌ ఫ్లో సామర్థ్యాలను ఫండ్‌ పరిశోధన బృందం చూస్తుంది. ఈ సామర్థ్యాల బలంతోనే ఈ పథకం వ్యాల్యూ విభాగంలో దీర్ఘకాలంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మంచి విలువను తెచ్చి పెడుతోంది. 

రాబడులు 
వ్యాల్యూ విభాగంలోనే అని కాదు, మొత్తం ఈక్విటీ మ్యచువల్‌ ఫండ్స్‌లోనే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌ పనితీరు ప్రమాణాలకు తగ్గకుండా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించొచ్చు. అదిపెద్ద వ్యాల్యూ ఫండ్‌ కూడా ఇదే. దీని నిర్వహణలో రూ.24,694 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 17 శాతంగా ఉంది. మూడేళ్లలో వార్షికంగా 24 శాతానికి పైనే పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్ల కాలంలో వార్షికంగా 14 శాతం, ఏడేళ్లలో 13 శాతం, పదేళ్లలో 14.40 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన రాబడి 20 శాతం.    

పోర్ట్‌ఫోలియో.. 
పస్త్రుతం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 92 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. 1.4 శాతం డెట్‌ సాధనాల్లో, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. మార్కెట్లో దిద్దుబాటు ఏర్పడితే ఇన్వెస్ట్‌ చేయడానికి వీలుగా నగదు నిల్వలు పెంచుకుంది. ఇక ఈక్విటీల్లోనూ 81 శాతాన్ని లార్జ్‌క్యాప్‌ కంపెనీలకే కేటాయించింది. 14 శాతాన్ని మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టింది. స్మాల్‌క్యాప్‌ పెట్టుబడులు 5 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 63 స్టాక్స్‌ ఉన్నాయి. పెట్టుబడుల్లో 19 శాతాన్ని బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు, 17 శాతాన్ని ఇంధనరంగ కంపెనీలకు, 12 శాతం హెల్త్‌కేర్‌ కంపెనీలకు, 10 శాతం కమ్యూనికేషన్‌ స్టాక్స్‌కు, 8 శాతం టెక్నాలజీ కంపెనీలకు కేటాయించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top