అప్పులంటే ఇష్టం లేదు... డెబిట్ కార్డుకే ప్రాధాన్యం
ఖర్చులకైనా, సలహాలకైనా డిజిటల్ వేదికలే శరణ్యం
చిన్నవయసు నుంచే పొదుపు... లాంగ్‌టర్మ్ లాభాలు
మరోవైపు చూస్తే... తెలియని ఖర్చులూ ఎక్కువే
సబ్‌స్క్రిప్షన్లు, వీకెండ్ షాపింగ్, నిరంతరం ఆర్డర్లు
డిజిటల్ లావాదేవీలతో నిరంతరం ఖర్చులు
‘బై నౌ.. పే లేటర్’కు మొగ్గు... తెలీకుండానే ట్రాప్‌లోకి
కొందరు ఫిన్‌ఫ్లుయెన్సర్ల తప్పుడు సలహాలతో డేంజర్‌లోకి
ఇవన్నీ నియంత్రించుకుంటే కొత్త ఎకానమీకి వీళ్లే ఆయువు
అప్పులంటే ఇష్టం లేదు. కానీ... ఈజీగా ‘ఇదిగో తీసుకో’ అంటూ వచ్చే మెసేజీలకు ఇట్టే ఆకర్షితులైపోతారు. అదుపులేకుండా వాడేస్తారు. ఎక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందో సొంతగానే విశ్లేషిస్తారు. తమకు అన్నీ తెలుసనుకుంటారు. కానీ... రీల్స్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇట్టే నమ్మేస్తారు. ఖర్చుల్ని నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటారు. కానీ స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా జరిపే లావాదేవీలతో... డబ్బు నిరంతరం ఖర్చవుతూనే ఉంటుంది. ముందే పొదుపు ఆరంభిస్తున్నారు.
చిన్నచిన్న డిస్కౌంట్లు, ఆఫర్లకన్నా... పారదర్శకంగా చార్జీలు వసూలు చేసే సంస్థలనే నమ్ముతున్నారు. స్మార్ట్ ఫోన్లలో వాడే అప్లికేషన్ల నుంచీ ఎంటర్‌టైన్‌మెంట్ వరకూ సబ్ర్‌స్కిప్షన్లు ఎక్కువ. ఎప్పటికప్పుడు కొత్త గాడ్జెట్లు, లైఫ్ స్టైల్‌ను అప్‌గేడ్ చేసుకోవటం అలవాటు. ఇదంతా ‘జెడ్’ జనరేషన్ గురించి. 16 ఏళ్లు దాటి... 30 ఏళ్లు నిండని యువతరం గురించి. వీరి అలవాట్లు కొన్ని మంచివే అయినా... కొన్నింటి విషయంలో జాగ్రత్తపడాల్సిందే. 2030 నాటికి జెన్ జెడ్, యువ మిలీనియల్స్ దేశీ వినియోగ వ్యయాల్లో మెజారిటీ వాటాకు చేరుతున్న నేపథ్యంలో... వీళ్లేం చేస్తున్నారో... ఏం చేస్తే బాగుంటుందో చెప్పే ‘సాక్షి వెల్త్’ స్టోరీ ఇది.
పదేళ్ల కిందటి వరకూ పర్సులో డబ్బులు లేకుండా కదలడమనేది ఊహక్కూడా అందేది కాదు. కానీ ఇప్పటి జెన్ జెడ్.. చేతిలో స్మార్ట్‌ఫోన్ తప్ప మరేదీ వెంట తీసుకెళ్లడం లేదు. యూపీఐ సహా డిజిటల్ లావాదేవీలు సర్వ సాధారణమైపోవటమే ప్రధాన కారణం. క్యాష్‌తో సౌకర్యం తక్కువని భావించటం వల్ల కూడా దీనిపై ఆధారపడటం తగ్గుతోంది. మరో గమనించదగ్గ అంశమేంటంటే ఈ తరం క్రెడిట్ కార్డులకు తక్కువ ప్రాధాన్యమివ్వటం.
యూపీఐ, మొబైల్ వాలెట్స్, డెబిట్ కార్డులనే ఎక్కువ వాడటం. క్యాష్‌ని అత్యంత తక్కువగా ఉపయోగిస్తున్నారు. పేమెంట్ మెథడ్ ఎంత సింపుల్‌గా ఉంటే అంత మంచిదనుకుంటున్నారు. పాత తరం వారు నెలవారీగా కొనుగోళ్లు, పండగ షాపింగ్‌లు జరుపుతుంటే... ఈ జెన్ జెడ్ మాత్రం వీకెండ్ షాపింగ్‌లే కాకుండా దాదాపు నిరంతరం ఖర్చు చేస్తూనే ఉన్నారు. క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, ఓటీటీ మెంబర్‌షిప్‌లు, గేమింగ్ సబ్‌్రస్కిప్షన్లు.. ఇలా ఒకటి కాదు నిత్యం బోలెడన్ని చిన్న చిన్న లావాదేవీలు చేస్తూనే ఉంటున్నారు. ఇలా వీరి ఖాతాల్లోంచి నిరంతరం ప్రవహిస్తున్న నగదు ఆధారంగా... ఇపుడొక కొత్త ‘రియల్ టైమ్ స్పెండింగ్ ఎకానమీ’ పుట్టుకొచ్చింది. అది అంతకంతకూ పెరుగుతోంది.
అప్పంటే ఇష్టం లేదు.. కానీ..
సాధారణంగా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టేస్తుందని యువతపై ఓ అభిప్రాయం ఉంది. కానీ జెన్ జెడ్ తరం ఆర్థిక అలవాట్లు లోతుగా చూస్తే ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక సంక్షోభాలు, కరోనా సమయంలో అనిశ్చితి, టెక్ రంగంలో ఉద్యోగాల కోతల్లాంటివన్నీ చూసిన మీదట ఈ తరం వాళ్లలో చాలా మంది ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు సంప్రదాయ క్రెడిట్ కార్డులకు బ దులు డెబిట్ కార్డుల వాడకానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీనితో సంప్రదాయ క్రెడిట్ కార్డ్ కంపెనీలకి ఈ సెగ్మెంట్లో అంతగా పట్టు లభించటం లేదు. కానీ కొత్తరూట్లో ‘‘బై నౌ, పే లేటర్’’ (బీఎన్‌పీఎల్) పేరిట సరికొత్త క్రెడిట్ సర్వీసులు తెచ్చేసరికి జెన్ జెడ్ ఇట్టే ఆకర్షితులయిపోతున్నారు. ఈ– కామర్స్, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాంలతో నేరుగా అనుసంధానమైన ఈ తరహా స్వల్పకాలిక ఫైనాన్సింగ్ ను యువతరం ఎక్కువగా ఉపయోగించుకుంటన్నా రు. దీనికి పలు కారణాలు ఉన్నాయి.
అవేంటంటే..
→ చాలా తక్కువ డాక్యుమెంటేషన్, అప్పటికప్పుడు అప్రూవల్
→ వార్షిక ఫీజులు లేకపోవడం, వడ్డీరహిత గ్రేస్ పీరియడ్
→ చిన్న చిన్న మొత్తాల్లో సరళంగా చెల్లించే
వెసులుబాటు
కాకపోతే, బీఎన్‌పీఎల్ అనేది చాలా సౌకర్యవంతమైనదే కానీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. వివిధ యాప్‌ల ద్వారా దాదాపు ఒకే వ్యవధిలో చేసే చిన్న చిన్న కొనుగోళ్లన్నీ ఒకేసారి తడిసి మోపెడై, అప్పుడప్పుడే ఆదాయార్జనలో పడిన యువతకు భారీ రుణ భారంగా మారుతున్నాయి కూడా. ఈ ప్రమాదాన్ని ఊహించాలన్నది ఆర్థిక నిపుణుల సూచన.
ఫిన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం..
యువతరం ఇప్పుడు ఆర్థిక సలహాల కోసం ఇంట్లో పెద్దవాళ్లనో, బ్యాంకు మేనేజర్లనో, చార్టర్డ్ అకౌంటెంట్లనో సంప్రదించడం తగ్గుతోంది. ఎక్కువగా ఫిన్‌ఫ్లుయెన్సర్ల వైపు మళ్లే ధోరణి పెరుగుతోంది. పాత తరం వాళ్లు ఆర్థిక సలహాల కోసం తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బ్యాంకు మేనేజర్లు, ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు, న్యూస్ పేపర్లు.. ప్రింట్ మీడియా, ఫిక్స్‌డ్ డిపాజిట్లవైపు చూసేవారు. కానీ జెన్ జడ్ మాత్రం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇంటిగ్రేటెడ్ ఫిన్‌టెక్ యాప్‌లు, యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లు, ఆన్‌లైన్ కమ్యూనిటీలు (రెడిట్, డిస్కార్డ్), ఆధునిక డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాంల వైపు చూస్తున్నారు. అన్ని చోట్లా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల చిన్న వయస్సు నుంచే ఆర్థిక అక్షరాస్యత మెరుగ్గా ఉంటున్నప్పటికీ, తప్పుడు సమాచారం కూడా భారీగానే వ్యాప్తి చెందుతోంది. వీటివల్ల దెబ్బతింటున్నవాళ్లూ పెరుగుతున్నారు. దీంతో అడ్డూ అదుపూ లేకుండా ఫిన్‌ఫ్లుయెన్సర్లు విస్తరిస్తుండటంపై ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థలు నిశితంగా దృష్టి పెడుతున్నాయి. తప్పుల తడకల ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ సలహాలను కట్టడి చేయడంపై కసరత్తు చేస్తున్నాయి.
ముందు నుంచే పెట్టుబడులు..
డిజిటల్ వల్ల కలిగిన ప్రయోజనమేంటంటే... తమ పేరెంట్స్‌తో పోలిస్తే జెన్ జెడ్ చాలా ముందు నుంచే పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు. దాదాపుగా అవరోధాలేమీ లేకపోవడంతో నెలకు రూ.100 నుంచి 500 వరకు ఉండే మైక్రో సిప్‌ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు) రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరి పోర్ట్‌ఫోలియో చాలా వైవిధ్యంగా ఉంటోంది. మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, డైరెక్ట్ ఈక్విటీలు, డిజిటల్ గోల్డ్, సావరీన్ గోల్డ్ బాండ్లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (రీట్స్) వంటివి ఈ పోర్ట్‌ఫోలియోలో ఉంటునాయి. ఇలా సాధ్యమైనంత ముందు నుంచే ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఈ జనరేషన్ వాళ్లు... వెల్త్ మేనేజర్లకు బంగారు గనుల్లా మారుతున్నారు. ఓ ఇన్వెస్టరును 22 ఏళ్ల వయసులో పట్టుకుంటే ఆ తర్వాత బోలెడన్ని సంవత్సరాల పాటు వారు క్లయింట్లుగా కొనసాగే అవకాశం ఉండటమే దీనిక్కారణం. అయితే, ఆర్థిక సంస్థలు ఇందుకోసం తమ మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటోంది. జెన్ జెడ్ డిస్కౌంట్లు.. లాయల్టీ పాయింట్ల కన్నా ఎక్కువగా చార్జీల విషయంలో పారదర్శకత, నైతికతతో కూడుకున్న వ్యాపార విధానాలు, డేటా ప్రైవసీకి ప్రాధాన్యమిస్తున్నారు.
హెచ్చరిక సంకేతాలు..
జెన్ జెడ్‌కి డిజిటల్ ఐక్యూ ఎక్కువే అయినా... కొన్ని విశిష్టమైన సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటోందని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.
మితిమీరిన లైఫ్‌స్టయిల్ ఖర్చులు: వేగంగా ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ, వాటికి తగ్గట్లు లైఫ్‌స్టయిల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ పోవడం వల్ల ఖర్చులు మితిమీరిపోతున్నాయి. ఫలితంగా, ఆదాయాలను దీర్ఘకాలిక పొదుపు వైపు మళ్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది.
సబ్‌స్క్రిప్షన్లతో చిల్లు: నెలవారీగా కట్టే డజన్ల కొద్దీ డిజిటల్ సబ్‌్రస్కిప్షన్ల వల్ల చిన్న, చిన్నగా పర్సుకు చిల్లులు పడుతున్నాయి.
సోషల్ మీడియా ఒత్తిడి: ప్రతిదాన్నీ డిజిటల్‌గా పోల్చి చూసుకునే సంస్కృతి వల్ల ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్), (ఇప్పుడు దొరకపుచ్చుకోకపోతే ఇంకెప్పటికీ దొరకదేమో అన్న భయం) వల్ల ఖరీదైన ఎక్స్‌పీరియన్స్‌లు, లగ్జరీ ఉత్పత్తులను కొనుక్కునే ధోరణి పెరుగుతోంది.
ఎమర్జెన్సీ నిధుల కొరత: అప్పటికప్పుడు సంతృప్తి కలిగించే ఎక్స్‌పీరియన్స్‌లకు ప్రాధాన్యం ఇస్తూ, ఆర్థిక భద్రతను పక్కన పెడుతుండటం వల్ల, ఆదాయంపరంగా అనూహ్యమైన షాక్‌లేవైనా తగిలితే తట్టుకునే పరిస్థితి ఉండటం లేదు.
గెలుపు గుర్రాలు..
జెన్ జెడ్ తెచ్చిన ఆర్థిక విప్లవమనేది దేశీ మార్కెట్ వ్యవస్థలో కొత్త మార్పులకు ఆజ్యం పోసింది. ఈ భారీ డెమొగ్రఫిక్ మార్పులతో ప్రభావితమయ్యే సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు ప్రయోజనం పొందవచ్చు. అవేమిటంటే ...
→ ఫిన్‌టెక్, వెల్త్ టెక్ ప్లాట్‌ఫామ్స్: డిజిటల్ చెల్లింపులు, ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్, మైక్రో రుణాలిచ్చే కంపెనీలు
→ ప్రైవేట్ బ్యాంకులు: పటిష్టమైన, అధునాతన డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలు అందించేవి.
→ ఫైనాన్షియల్ సూపర్ యాప్స్: పేమెంట్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్, బీమాను ఒకే ఇంటర్‌ఫేస్‌లో అందించేవి.
→ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు: భారీ స్థాయిలో సిప్ రూపంలో రిటైల్ పెట్టుబడులను అందుకుంటున్న మ్యూచువల్ ఫండ్ సంస్థలు.
ఇలా, డిజిటల్‌గా ఆర్థిక సేవలను అందించే, తద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోగలిగే ఆర్థిక సంస్థలే భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లగలవు.
– సాక్షి, వెల్త్


