 
													న్యూఢిల్లీ: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు బ్యాంకు వర్గాలు ఆదివారం తెలిపాయి. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు.
58 ఏళ్ల పటేల్ మూడేళ్ల పదవీకాలం గల ఏఐఐబీ ఐదుగురు ఉపాధ్యక్షుల్లో ఒకరుగా ఉంటారు. వచ్చే నెలలో ఆయన తన పదవిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఏఐఐబీలో వైస్ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన డిజె పాండియన్ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు ఏఐఐబీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. గతంలో గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పాండియన్ ఈ నెల చివర్లో భారతదేశానికి తిరిగి రానున్నారు.సెప్టెంబర్ 5, 2016న రఘురామ్ రాజన్ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 2018లో "వ్యక్తిగత కారణాల వల్ల" పటేల్ రాజీనామా చేశారు.

సెప్టెంబర్ 6, 2016న బాధ్యతలు చేపట్టడానికి ముందు అతను రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో ఆర్‌బీఐలో ద్రవ్య విధాన విభాగాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు. పటేల్ గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ & రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ ఇతర సంస్థలతో కలిసి పనిచేశారు. ఏఐఐబీ నుంచి 28 ప్రాజెక్టులకు 6.8 బిలియన్ డాలర్లు రుణం తీసుకుంది. అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించిన భారతదేశానికి ఏఐఐబీ పటేల్ పోస్టింగ్ ముఖ్యమైనది అని పాండియన్ శనివారం తన వీడ్కోలు సమయంలో తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
