ఉద్యోగులకు పెయిడ్‌ లీవ్స్‌ ఉండాలి - మాజీ సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు

Former Pepsico CEO Indra Nooyi Comments On Paid Leaves in corporate world - Sakshi

పెప్సీకో వంటి అంతర్జాతీయ బ్రాండ్‌కి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పని చేసి సంస్థను లాభాల్లో పెట్టిన వనితగా ఇంద్రానూయికి పేరుంది. ఇరవై ఐదేళ్ల పాటు పెప్సీకోలో వివిధ హోదాల్లో పని చేసిన ఆమె 2018లో సీఈవోగా అక్కడ రిటైర్‌ అయ్యారు. అయితే ఒక ఉద్యోగి జీవితంలో పెయిడ్‌ లీవ్స్‌ ప్రాముఖ్యత ఎంత ఉంటుందనే అంశాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమె చెప్పుకొచ్చారు...

నా కెరీర్‌ మొదలు పెట్టిన తొలి రోజుల్లో బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ)లో పని చేస్తున్నాను. అప్పుడు మా నాన్నకి క్యాన్సర్‌ వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. నేను ఆయన్ని చూసుకోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో పెయిడ్‌ లీవ్స్‌ అడిగితే ముందు కుదరదని చెప్పారు. దీంతో నా జీవితం ఒక్కసారిగా డోలాయమానంలో పడింది. ఓ వైపు తండ్రి ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు, మరోవైపు జాబ్‌ వదిలేయాల్సిన పరిస్థితి. ఏం చేయాలో పాలుపోలేదు అంటూ ఆనాటి రోజులను ఇంద్రానూయి  జ్ఞాపకం చేసుకున్నారు.

చివరకు ఎలాగోలా మా నాన్నను చూసేందుకు సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లకే నాన్న చనిపోయారు. ఈ సమయంలో కంపెనీ నాకు ఆరు నెలల పాటు పెయిడ్‌ లీవ్‌ మంజూరు చేసింది. అయితే నాన్న అంత్యక్రియలు, ఆ తర్వాత కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అంటే మూడు నెలల రెండు రోజుల తర్వాత నేను తిరిగి విధుల్లో చేరాను. నాకు అవసరం లేకపోవడంతో దాదాపు మూడు నెలల పాటు పెయిడ్‌ లీవ్స్‌ వదులుకున్నాను. 

కంపెనీ నాకు పెయిడ్‌ లీవ్స్‌ నిరాకరించడం, ఆ తర్వాత మంజూరు చేయడం, పనిపై మక్కువతో నేను పెయిడ్‌ లీవ్స్‌ పూర్తిగా వాడుకోకపోవడం వంటివి అసాధారణ విషయాలేమీ కాదు. కానీ కనీసం పెయిడ్‌ లీవ్స్‌ ఉంటాయని తెలియని వాళ్లు, పెయిడ్‌లీవ్స్‌ లేకపోయినా అనేక కష్టాల మధ్య ఉద్యోగాలు చేసే వాళ్లని తలచుకుంటేనే నాకు బాధగా ఉందంటూ తెలిపారు ఇంద్రానూయి.

కంపెనీ అభివృద్ధికి అహార్నిషలు పని చేసే ఉద్యోగులకు కష్టకాలంలో అక్కరకు వచ్చేలా పెయిడ్‌ లీవ్స్‌ ఉండాలనే అర్థంలో అమె కామెంట్లు చేశారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంద్రనూయి లాంటి పేరొందిన సీఈవో నోట పెయిడ్‌ లీవ్స్‌పై వ్యాఖ్యలు రావడం కార్పోరేట్‌ సెక్టార్‌ ఉద్యోగులకు సంబంధించినంత వరకు శుభపరిణామం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

చదవండి: Indra Nooyi: మన్మోహన్‌సింగ్‌, బరాక్‌ ఒబామా.. ఆ రోజు ఎన్నడూ మరువలేను

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top