ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్‌' నిధుల దుర్వినియోగంపై సమీర్‌!

Forget Ashneer Grover, Bharatpe Set To List In 18-24 Month0s - Sakshi

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పే మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో పటిష్ట పనితీరు చూపినట్లు కంపెనీ సీఈవో సుహయిల్‌ సమీర్‌ తాజాగా పేర్కొన్నారు. లాభనష్టాలులేని(బ్రేక్‌ఈవెన్‌) స్థితికి చేరే బాటలో వృద్ధి పథాన సాగుతున్నట్లు తెలియజేశారు. 18–24 నెలల్లో పబ్లిక్‌ ఇష్యూని సైతం చేపట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ మాజీ చీఫ్‌ అష్నీర్‌ గ్రోవర్‌ నిధుల దుర్వినియోగ ఆరోపణ అంశాన్ని బోర్డు చూసుకుంటుందని పేర్కొన్నారు.

 ఉద్యోగులకే తమ తొలి ప్రాధాన్యత అని, టీముల స్థిరత్వంపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఇక బిజినెస్‌ వృద్ధి ద్వితీయ ప్రాధాన్యతగా పేర్కొంటూ ఇందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇది కంపెనీ ఫలితాలలో ప్రతిఫలిస్తున్నట్లు తెలియజేశారు. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ ప్రతీ అంశంలోనూ 20 శాతం పురోగతి సాధించినట్లు వెల్లడించారు. కోవిడ్‌–19 జనవరిలో దెబ్బతీసినప్పటికీ లావాదేవీలు, టీపీవీ, రుణాల ఏర్పాటు, ఆదాయం తదితర పలు అంశాలలో ప్రస్తావించదగ్గ వృద్ధి సాధించినట్లు వివరించారు.   

టీపీవీ జోరు 
క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా షాపు యజమానులు డిజిటల్‌ చెల్లింపులను చేపట్టేందుకు వీలు కల్పించే భారత్‌పే 225 పట్టణాలకు విస్తరించినట్లు సుహయిల్‌ తెలియజేశారు. 80 లక్షలకుపైగా మర్చంట్స్‌ నమోదైనట్లు, లావాదేవీ విలువ(టీపీవీ) 2.5 రెట్లు ఎగసి 16 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 1.2 లక్షల కోట్లు)ను తాకినట్లు వెల్లడించారు. 65 కోట్ల డాలర్ల(రూ. 4,875 కోట్లు) విలువైన రుణాలకు సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. బయ్‌ నౌ పే లేటర్‌ విభాగంలో ఐదు నెలల క్రితం ఆవిష్కరించిన పోస్ట్‌పే నెలకు 10 లక్షల లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 5 కోట్ల డాలర్ల(రూ. 375 కోట్లు) విలువైన టీపీవీ సాధించినట్లు వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top