
బీమా రంగాన్ని ఆధునీకరించే దిశగా హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ ఫోరేసాఫ్ట్, అమెరికాకు చెందిన ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్‌తో చేతులు కలిపింది. బీమా కంపెనీలు, వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత ఆటోమేషన్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఫోరేసాఫ్ట్ తెలిపింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో రిస్క్ తగ్గించడం, మోసాలను గుర్తించేందుకు ఈ ఏఐ టూల్స్ వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చూకూరుస్తాయని పేర్కొంది.
ఆరోగ్య బీమా క్లెయిమ్ దాఖలు చేయడం నుంచి ప్రమాదాన్ని నివేదించడం లేదా కొత్తగా క్లెయిమ్ కవరేజీ కోసం దరఖాస్తు చేయడం వరకు వినియోగదారులు ఈ ఏఐ టూల్స్ ద్వారా బీమా సంస్థలతో చర్చించే అవకాశం ఉందని ఫోరేసాఫ్ట్ తెలిపింది. ప్రధానంగా కింది అంశాలపై మెరుగైన సర్వీసులు పొందవచ్చని చెప్పింది.
వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్: ప్రమాదం జరిగిన వెంటనే ఏఐ సిస్టమ్‌లు ప్రారంభ క్లెయిమ్ అప్లికేషన్‌ను ఆటోమేట్ చేస్తాయి. మాన్యువల్ పేపర్ వర్క్‌ను తగ్గిస్తాయి. దాంతో వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.
స్మార్ట్ రిస్క్ అసెస్‌మెంట్: కృత్రిమ మేధ ఇంజిన్లు నిర్మాణాత్మక డేటా (వినియోగదారుల వైద్య చరిత్ర వంటివి)ను విశ్లేషించి ఆ సమాచారాన్ని మదింపు చేస్తాయి.
ఫ్రాడ్ డిటెక్షన్: ఏఐ టూల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ ఫ్రాడ్ డిటెక్షన్ మాడ్యూల్స్ అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే పర్యవేక్షిస్తాయి. నిజమైన పాలసీదారులను రక్షిస్తాయి.
ఈ సందర్భంగా ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్ ప్రెసిడెంట్ మృదుల మునగాల మాట్లాడుతూ..‘ఈ ఏఐ టూల్స్ వల్ల మోసపూరిత క్లెయిమ్‌లను కట్టడి చేస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించవచ్చు’ అని చెప్పారు. ఫోరేసాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వాసు బాబు వజ్జా మాట్లాడుతూ..‘ఇన్సూరెన్స్ కంపెనీల పునరుద్ధరణకు తోడుగా తదుపరి తరం ఏఐ సర్వీసులు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ మరింత స్మార్ట్‌గా, వేగంగా, పారదర్శకంగా బీమాను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా ఇరుకంపెనీలు ఇన్సూరెన్స్ ఏఐలో నిరంతర ఆర్ అండ్ డీకి మద్దతుగా హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా, మిడిల్‌ఈస్ట్‌లో పైలట్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అధికారులు చెప్పారు. ఇందుకోసం ఇంజినీరింగ్, సర్వీస్ డెలివరీలో 100 మందికి పైగా నిపుణులను నియమించుకోవాలని ఫోరేసాఫ్ట్ యోచిస్తోంది.
ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..