
బంగారు రుణాల కొత్త ముసాయిదా నిబంధనల నుంచి చిన్న రుణగ్రహీతలకు మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వశాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)ను కోరింది. బంగారం తనఖా పెట్టి రూ.2 లక్షల వరకు రుణాలు పొందేవారికి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోపాటు కొందరు ఆర్థిక నిపుణుల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే అదనంగా కొన్ని మార్గదర్శకాలను జనవరి 1, 2026 నుంచి అమలు చేయాలని మంత్రిత్వ శాఖ ఆర్‌బీఐకి సిఫార్సు చేసింది.
ప్రతిపాదిత మార్పులు ఇలా..
ఆర్‌బీఐ ముసాయిదా నిబంధనల్లో రుణగ్రహీతలను గణనీయంగా ప్రభావితం చేసే రెండు కీలక మార్పులను ప్రతిపాదిస్తున్నారు. అందులో లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తి తగ్గింపు నిర్ణయం కీలకంగా ఉంది. అంటే రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారం విలువలో ఇప్పటివరకు 80% వరకు రుణాలు వచ్చేవారు కాస్తా దీన్ని 75% కి తగ్గించాలనే ప్రతిపాదనలున్నాయి. దీని ద్వారా రుణగ్రహీతలు బంగారంపై తక్కువ డబ్బును పొందుతారు. తాకట్టు పెట్టిన బంగారానికి యాజమాన్య రుజువును అందించాలనేలా మరో ప్రతిపాదన ఉంది.
ఇదీ చదవండి: టర్కీ ఎయిర్‌లైన్స్ డీల్ ప్రశ్నార్థకం
ఆ నిబంధనలను ఖరారు చేయడానికి ముందు ఆర్‌బీఐ ప్రస్తుత బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలతో సహా ఇతర వాటాదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సమీక్షిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నిరంతరాయంగా రుణ సదుపాయం లభించేలా చూడటం ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ విధుల్లో ప్రాథమిక అంశమని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.