
జీవితమంటేనే కష్టాలు, కన్నీళ్లు. వీటికి భయపడకుండా పట్టుదలతో కృషి చేస్తేనే.. సక్సెస్ సాధ్యమవుతుంది. దీనిని నిరూపించినవాళ్ల గురించి గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఇదేకోవకు చెందిన మరో వ్యక్తి గురించి.. అతని సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.
2008లో ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి స్టాక్ మార్కెట్లో సర్వసం కోల్పోయాడు. కానీ కొడుకు దశాబ్దానిపైగా కృషి చేసి.. కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఏడాదికి రూ. 2.4 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.
ఢిల్లీలో మధ్య తరగతిలో పుట్టి పెరిగిన ఆ వ్యక్తి (కొడుకు).. ప్రారంభ జీవితం చాలా సాఫీగా సాగింది. అయితే 2008లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చదువుకునే రోజుల్లోనే.. పాఠశాలలో నాటకాలు, డ్యాన్స్ ఇతర కార్యకలాపాలలో పాల్గొనేవాడు. ఇంటర్మీడియట్‌లో సైన్స్ ఎంచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో తన బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.
చదువు పూర్తయిన తరువాత 2014లో నెలకు రూ. 35,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. 2016లో తన స్నేహితురాలికి దగ్గరగా ఉండాలని ఉద్యోగం మారాడు. అప్పుడు అతని జీతం రూ. 60,000లకు పెరిగింది. 2017లో మరొక ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతని జీతం రూ. 90,000లకు చేరింది. ఐదేళ్లు అదే కంపెనీలు ఉంటూ.. 2021 నాటికి నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదించే స్థాయికి ఎదిగాడు.
ఇదీ చదవండి: వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
2022లో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఆఫర్ వచ్చింది. అక్కడ అతని వార్షిక వేతనం 202000 డాలర్లు (రూ.1.7 కోట్ల కంటే ఎక్కువ). 2025 నాటికి అతని వేతనం రూ. 2.4 కోట్ల కంటే ఎక్కువ అయింది. కేవలం రూ. 35000 జీతంతో మొదలైన వ్యక్తి.. రూ.2.4 కోట్ల వేతనం వరకు ఎదిగాడంటే.. దాని వెనుక అతని శ్రమ ఎంత ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఉద్యోగం చేసే సమయంలో.. జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించారు. మొత్తం నాలుగు ఖండాల్లో 17 దేశాలు ప్రయాణించాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణించిన ఇతడు.. లగ్జరీ విమానాలలో ప్రయాణించే వరకు ఎదిగాడు. డబ్బు ఒక నిర్దిష్ట స్థాయి వరకు ముఖ్యమైనదని, కానీ దానికి మించి, ఆరోగ్యం, సంబంధాలు, అనుభవాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వ్యక్తి చెబుతాడు. జీవితంలో ఏ దశలోనైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి పొందలేమని పేర్కొన్నారు.