
ఏఐ విజృంభణతో వేలాదిగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫ్రెషర్లకు మంచి జీతంతో ఉద్యోగాలు రావడమే కష్టమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఓ 23 ఏళ్ల కుర్రాడు మాత్రం మరో విధంగా నిరూపించాడు. ఈశాన్య భారతదేశంలోని ఒక చిన్న పట్టణానికి చెందిన ఈ టెకీ పట్టుదల, నైపుణ్యం అన్ని సవాళ్లను, వైఫల్యాలను అధిగమించగలవని నిరూపించాడు.
ఏకంగా 500 పైగా తిరస్కరణలను ఎదుర్కొన్న ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఏఐలోనే అగ్ర సంస్థలలో ఒకటైన ఓపెన్ఏఐలో పనిచేస్తున్నారు. నెలకు రూ.20 లక్షల జీతం. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం.
బీటెక్ చేసిన మొదటి వ్యక్తి
ఈ యువ ఇంజనీర్ రెడ్డిట్ పోస్టు ప్రకారం.. తన కుటుంబంలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన మొదటి వ్యక్తి ఇతనే. ఏడాదికి రూ.3.6 లక్షల వేతనంతో మొదట్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫర్ వచ్చింది. తీసుకున్నాడు. అయితే జాయిన్ డేట్ కోసం ఎదురుచూడకుండా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాడు.
ఒక్క ఇంటర్వ్యూ దక్కింది.. పట్టేశాడు
వందలాది రిమోట్ అంతర్జాతీయ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ప్రారంభించాడు. ఈ మార్గం ప్రారంభంలో లెక్కలేనన్ని తిరస్కరణలకు దారితీసింది, కానీ చివరికి ఫలించింది. ‘నెలల తరబడి తిరస్కరణ తరువాత తిరస్కరణ. ఆ అప్లికేషన్లలో నాకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ మాత్రమే వచ్చింది, ఎలాగోలా క్లియర్ చేశాను’ అంటూ రెడిట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
దాదాపు 500-600 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న టెక్కీ ఓపెన్ఏఐ లింక్డ్ ప్రాజెక్టుతో ఒకే ఇంటర్వ్యూను పొంది విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. మొదట్లో ఏడాదికి రూ.3.6 లక్షలుగా ఉన్న ఆయన జీతం ఇప్పుడు నెలకు రూ.20 లక్షలకు చేరింది.
అయినా ‘ఆగడు’
రూ.లక్షల జీతంతో చేతిలో ఉద్యోగం ఉన్నా టెక్కీ మాత్రం ఆగడం లేదు. ఓపెన్ఏఐ లింక్డ్ ప్రాజెక్టు ద్వారా వచ్చే అదనపు డబ్బుతో సొంతంగా టెక్ సంస్థను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. ఇది పూర్తయితే అతను తన లాంటి మరింత మందిని చేర్చుకుని పెద్ద ప్రాజెక్టులపై పనిచేయాలనుకుంటున్నాడు. మంచి కంపెనీల్లో సౌకర్యవంతమైన ఒక్క జాబ్ వస్తే చాలు స్థిరపడాలనుకుంటున్న యువతకు ఈ కుర్రాడు భిన్నంగా ఆలోచిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.