
అత్యుత్తమ టెలికం సేవలున్న టాప్ 3 దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సర్వీసులను మెరుగుపర్చేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు అక్టోబర్ 1 నుంచి మరింత కఠినతరమైన నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు.
వీటిపై టెలికం ఆపరేటర్లు ఇప్పటికే తొలి నివేదికలను అందించాయని, సర్వీసుల నాణ్యత సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించడంపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. వైఫై విస్తృతిని పెంచేందుకు 6 గిగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంలో కొన్ని ఫ్రీక్వెన్సీలకు లైసెన్సు నుంచి మినహాయింపునిచ్చినట్లు సింధియా చెప్పారు. దీంతో నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలను ఉపయోగించుకునే కంపెనీలు స్పెక్ట్రం ఫీజులేమీ చెల్లించనక్కర్లేదని పేర్కొన్నారు.
శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నుంచి తుది సిఫార్సులు వచ్చిన తర్వాత నిబంధనలను ఖరారు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇక టెలికం నెట్‌వర్క్ విస్తరణను మరింత వేగవంతం చేస్తున్నామని, ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 1,882 సమస్యలను పరిష్కరించామని, మరో 533 అంశాలపై రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.