
వేతనాల పెంపు కోసం చాలా మంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. కానీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కేవలం నాలుగు నెలల్లోనే భారీ వేతన పెంపును అందుకున్నాడు. కంపెనీలో చేరినప్పుడు తన సీటీసీ(CTC)లో 100% పెరిగిన కొద్ది నెలలకే మరోసారి వేతన పెంపు అందుకున్నాడు. ఈమేరకు రెడ్డిట్‌లో చేసిన పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది.
పోస్ట్‌లోని వివరాల ప్రకారం..‘నేను ప్రముఖ కంపెనీలో ఇటీవలే చేరాను. నాకు 7.2 ఏళ్ల పని అనుభవం ఉంది. అంతకుముందు పని చేసిన కంపెనీతో పోలిస్తే కొత్త సంస్థ 100 శాతం సీటీసీను పెంచింది. నేను ఇంటర్వ్యూలో అడిగిన దానికంటే ఎక్కువగానే వేతనం ఇచ్చారు. దాంతో నాకు ఏటా రూ.31 లక్షలు ఆఫర్ చేశారు. కొత్త సంస్థలో చేరి నాలుగు నెలలైంది. ఇటీవల అప్రైజల్స్ వచ్చాయి. అందులో ఆశ్చర్యంగా నాకు మరో లక్ష పెంచారు. దాంతో నా వార్షిక వేతనం రూ.32 లక్షలైంది’ అని రాసుకొచ్చారు.
ఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఇది అసాధారణమైనది కాదు. మంచి స్టార్టప్ కంపెనీలు నైపుణ్యాలున్న వారి కోసం ఇలా చేస్తాయి’ అని ఒకరు తెలిపారు. మరోవ్యక్తి స్పందిస్తూ..‘కేవలం 5 నెలల్లోనే నేను 16% పెంపు పొందాను’ అని చెప్పారు.
ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి!