
ఫారం 26ఏఎస్ ఒక సమగ్రమైన సమాచార పట్టిక. మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే, ఈ స్టేట్‌మెంట్ ఉంటుంది. ఇందులో ఏయే సమాచారం పొందుపరుస్తారంటే..
టీడీఎస్
టీసీఎస్
మీరు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్
ఈ ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన రిఫండ్ వివరాలు
నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలు
స్థిరాస్తి విక్రయ సందర్భంలో జరిగిన టీడీఎస్
టీడీఎస్‌లో జరిగిన పొరపాట్లు
మీరు చెల్లించాల్సిన డిమాండ్లు.. అంటే గత సంవత్సరపు బకాయిలు
అలాగే రిఫండ్ వివరాలు
మీ కేసులో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్. అలాగే పూర్తయిన వివరాలు
డిపార్టుమెంట్ వారు జారీ చేసిన ‘తరచుగా అడిగే ప్రశ్నలు-జవాబులు’, అంటే, ఎఫ్‌ఏక్యూ శీర్షికలో కేవలం ట్యాక్స్ సమాచారానికి సంబంధించిన ‘మిస్-మ్యాచ్’ల విషయమే ప్రస్తావించారు. సలహా ఏమిటంటే.. పాన్ వెరిఫై చేయండి. సంవత్సరం వెరిఫై చేయెడి. చలాన్ నంబర్ చెక్ చేయండి.బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు, బ్రాంచ్ కోడ్, తేదీ ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేయమంటున్నారు. ఇలాంటి విషయాల్లో తప్పులు జరగడం సహజం. ఒక్క అక్షరం తప్పయినా లేక ఒక్క అంకె తప్పయినా, ఎంట్రీలు జమ అవ్వవు. అప్పుడప్పుడు ఆదాయ పన్ను శాఖ ట్రెజరీ అకౌంటులో కొన్ని కోట్ల మొత్తం.. సమన్వయం కాకపోవడం వల్ల పేరుకుపోయి ఉంటుంది. అందుకని సమాచారం రాసినప్పుడు తగిన జాగ్రత్త వహించాలి. ఇదంతా పన్నుకి సంబంధించినది.
ఇంకో క్షోభ. ఫ్యామిలీ పెన్షనర్ కృష్ణవేణమ్మగారి కేసులో మూడు నెలల పెన్షన్ మాత్రమే ఫారం 26 ఏఎస్ కనిపిస్తోంది. ఇంతే మొత్తం ఇతర ఫారాల్లో కూడా పడింది. ఫ్యామిలీ పెన్షన్ మీద టీడీఎస్ ఉండదు. మూడు నెలల్లో రూ. 3,00,000 దాటలేదు. నిజానికి పన్నెండు నెలల పెన్షన్, మేడమ్ గారి బ్యాంకు అకౌంటులో జమయ్యింది. ఆవిడగారికి పక్కింటి పరంధామయ్య గారు చెప్పిన రూలు.. ఈ మూడు ఫారాలు, వెబ్‌సైట్, ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లోని వివరాలకు మించి వెళ్లకూడదు. అధిగమించకూడదు. అతిక్రమించకూడదు అని. మేడంగారిని ఒప్పించడానికి తలప్రాణం తోకకి వచ్చింది. 26ఏఎస్‌లో తప్పులు దొర్లితే సర్దుబాటుకి వెసులుబాటు లేదు. ఏఐఎస్‌లో తప్పు దొర్లితే తప్పుని సరి చేయమని వేడుకోవచ్చు.
ఇక్కడ బేసిక్ విషయం ఏమిటంటే, ఇప్పటికీ కొన్ని గవర్నమెంటు కార్యాలయాల నుంచి సమాచారం అరకొరగా వస్తోంది. పూర్తిగా రావడం లేదు. దాన్నే 26ఏఎస్‌లో చూపిస్తున్నారు. అటు, రెడ్డిగారి కేసులో టీఐఎస్ ఫారంలోనే బ్యాంకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్, వడ్డీ వేయడంతో.. ఒక కాలమ్‌లోని మొత్తానికి, మరో కాలమ్‌లోని మొత్తానికి తేడాలున్నాయి. దేన్ని తీసుకోవాలనేది ప్రశ్న.
ఇక మోహన్‌గారి విషయంలో ఏఐఎస్‌లో బ్యాంకు వడ్డీ రెండు సార్లు రిపీట్ అయ్యింది. దానివల్ల డబుల్ ట్యాక్సేషన్ జరిగినట్లు నిర్ధారించవచ్చు. అసలే అమెరికా నుంచి అర్ధరాత్రి నిద్ర మానుకుని లెక్కలు చూసుకుంటున్న మోహన్‌గారికి భయం, నిద్రలేమి, కోపం, బీపీ, టెన్షన్ పెరిగిపోయాయి. కామేశ్వరమ్మగారి కేసులో ఫారం 26ఏఎస్ బ్యాంకు వడ్డీ, ఏఐఎస్‌లోని వడ్డీ .. ఒకేగా లేదు. తేడా వేలల్లో ఉంది. ఈ మూడింటిలోని అంశాలు ఒకదానితో ఒకటి పెర్‌ఫెక్టుగా ట్యాలీ అయ్యిందంటే, మీరు అదృష్టవంతులనుకోవాలి. దేవుడికి కొబ్బరికాయ కొట్టి, ఫైలింగ్ ప్రక్రియ మొదలెట్టండి.
ఇక మ్యుచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే క్యాపిటల్ గెయిన్స్ విషయం తీసుకుంటే ఇదివరకు చాలా మంది క్లయింట్లు ఈ సమాచారాన్ని చెప్పకుండా దాచేసి, మతలబు చేసేవారు. ఇప్పుడది కాస్తా బట్టబయలవుతోంది. అయితే, దురదృష్టవశాత్తూ, ఈ విషయంలోనూ రెండు పెద్ద సంస్థలు, ఒకటి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, మరొకటి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ అండ్ రీకన్సిలియేషన్ సెంటర్ ఇస్తున్న సమాచారంలో తేడాలు ఉంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు. ట్యాక్స్ కంప్యూటేషన్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు తలెత్తడం వల్ల క్లయింట్లు కలవరపడుతున్నారు.
ఈ పొరపాట్లు తాత్కాలికమే కావచ్చు.. టెక్నికల్ గ్లిచెస్ కావచ్చని తీసిపడేయకండి. న్నీ డిక్లేర్ చేసి ఆదాయ పన్ను కడదామనుకునే వారికి అడ్డుపడుతూ, ఏదైనా అవకాశం దొరికితే ఎగవేసేందుకు ఎదురుచూసే వారికి ఇవి అవకాశాలు కలిగించేలా ఉన్నాయి.
మీరు జాగ్రత్త వహించండి.
ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య