ఈక్విటీ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు!

Equity Mutual Funds Inflow Dries 42% In July - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక జూలైలో నిదానించింది. కేవలం రూ.8,898 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ పథకాలు ఆకర్షించాయి. అంతకుముందు జూన్‌ నెలలో వచ్చిన రూ.15,495 పెట్టుబడులతో పోల్చి చూస్తే 43 శాతం తగ్గాయి. మే నెలలో రూ.18,529 కోట్లు, ఏప్రిల్‌లో రూ.15,890 కోట్ల చొప్పున పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. 

అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలైలోనే పెట్టుబడులు తక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతల ప్రభావం పెట్టుబడులపై పడినట్టు తెలుస్తోంది. ఫండ్స్‌ పెట్టుబడుల వివరాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫీ) సోమవారం విడుదల చేసింది. ఇన్వెస్టర్లలో సానుకూల ధోరణికి నిదర్శనంగా 2021 మార్చి నుంచి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అంతకుముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్‌బీఐ ఆగస్ట్‌లోనూ రేట్లను పెంచొచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించి ఉంటారని మార్నింగ్‌స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ కవితా కృష్ణన్‌ తెలిపారు.  

స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు ఆదరణ 
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ పథకాలు అత్యధికంగా రూ.1,780 కోట్లను జూలైలో ఆకర్షించాయి. ఆ తర్వాత ఫ్లెక్సీక్యాప్‌ పథకాల్లోకి రూ.1,381 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌ క్యాప్, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ ఫండ్‌ విభాగాలు ఒక్కోటీ రూ.1,000 కోట్లకు పైనే నికర పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ రూపంలో రూ.12,140 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్‌ ఖాతాల సంఖ్య 5.61 కోట్లకు చేరుకుంది. ఇక గత నెలలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి రూ.4,930 కోట్ల పెట్టుబడులు నికరంగా వచ్చాయి.

జూన్‌లో రూ.92,247 కోట్లు డెట్‌ నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించాలి. గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు) నుంచి రూ.457 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. మొత్తం మీద మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ గత నెలలో రూ.23,605 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ జూలై చివరికి రూ.37.75 లక్షల కోట్లకు చేరింది. జూన్‌ చివరికి ఇది రూ.35.64 లక్షల కోట్లుగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top