Electric 2Ws 3Ws: ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు జూమ్‌..

Electric 2Ws 3Ws may lap up major chunk of total sales pie by 2030: Report - Sakshi

 2030 నాటికి ద్విచక్ర,  త్రిచక్ర వాహనాల హవా 

మొత్తం అమ్మకాల్లో  70 శాతం వరకూ వాటా 

ఏసీఎంఏ, మెకిన్సే నివేదిక

న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరగనున్నాయి. 2030 నాటికి మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 50-70 శాతం వరకూ ఉండనుంది. ఆటోమోటివ్‌ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏసీఎంఏ సదస్సు సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు.

ఈ నివేదిక ప్రకారం ప్యాసింజర్, భారీ వాణిజ్య వాహనాలతో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటమనేది ఎలక్ట్రిక్‌ ద్వి, త్రిచక్ర వాహనాల విషయంలో ఆకర్షణీయ అంశంగా ఉండనుంది. దేశీయంగా ప్యాసింజర్, భారీ వాణిజ్య వాహనాల విభాగంలో విద్యుదీకరణ నెమ్మదిగా ఉండనుంది. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్లతో (ఐసీఈ) నడిచే వాహనాల ఆధిపత్యమే కొనసాగనుంది. 2030 నాటికి కొత్త వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల వాటా 10-15 శాతం, విద్యుత్‌ వాణిజ్య వాహనాల వాటా 5-10 శాతంగా ఉండనుంది.  (బిలియనీర్‌ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?)

నివేదిక ప్రకారం వచ్చే దశాబ్దకాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగడమనేది వాహనాల పరిశ్రమ దిశను మార్చేయనుంది. యూరప్, చైనా మార్కెట్లు ఈ మార్పునకు సారథ్యం వహించనుండగా, మిగతా ప్రపంచ దేశాలు వాటిని అనుసరించనున్నాయి. ఈ దశాబ్దం మధ్య నాటికి భారత్, చైనాలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు గరిష్ట స్థాయికి పుంజుకోనున్నాయి.

సమీప కాలంలో సరఫరాపరమైన అంతరాయాలు ఎదురైనప్పటికీ వాహనాల పరిశ్రమకు దీర్ఘకాలికంగా అవకాశాలు అత్యంత ఆశావహంగానే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పరిశ్రమ ముఖచిత్రం మారుతున్న నేపథ్యంలో దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ సాంప్రదాయ మార్కెట్లకే పరిమితం కాకుండా కొత్త మార్కెట్లకు కూడా ఎగుమతులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.  (Swiggy, Zepto: లేట్‌ నైట్‌ అయినా సరే.. చిటికెలో డెలివరీ!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top