
భారత్‌లో రెండు దశాబ్దాలుగా పెరిగిన అసమానత
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాలుగా (2000 తొలి నాళ్ల నుంచి) భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయి. 2022–23 గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయాల్లో 22.6 శాతం వాటా, అలాగే సంపదలో 40.1 శాతం వాటా కేవలం ఒక్క శాతం ప్రజలదే ఉంటోంది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా వంటి దేశాలతో పోలి్చనా ఇది చాలా ఎక్కువ. ’1922–2023 మధ్య కాలంలో భారత్‌లో ఆదాయ, సంపద అసమానతలు: పెరిగిన బిలియనీర్ల రాజ్యం’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం ముఖ్యంగా 2014–15 నుంచి 2022–23 మధ్య కాలంలో కొందరి వద్దే అత్యధికంగా సంపద కేంద్రీకృతమవ్వడమనేది మరింతగా పెరిగింది. థామస్ పికెటీ (ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్), లూకాస్ చాన్సెల్ (హార్వర్డ్ కెనెడీ స్కూల్, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్), నితిన్ కుమార్ భారతి (న్యూయార్క్ యూనివర్సిటీ, వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్) ఈ నివేదికను రూపొందించారు. నికర సంపద దృష్టికోణం నుంచి చూస్తే భారత ఆదాయపు పన్ను వ్యవస్థ తిరోగామి విధానంగా అనిపించవచ్చని నివేదిక పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఆదాయం, సంపదను పరిగణనలోకి తీసుకునేలా పన్ను విధానాన్ని పునర్‌వ్యవస్థీకరించడం, ఆరోగ్యం.. విద్య..పౌష్టికాహారంపై ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కేవలం సంపన్న వర్గాలే కాకుండా సగటు భారతీయుడు కూడా గ్లోబలైజేషన్ ప్రయోజనాలను పొందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపింది. అలాగే అసమానతలపై పోరాడేందుకు 2022–23లో అత్యంత సంపన్నులుగా ఉన్న 167 కుటుంబాలపై 2 శాతం ‘సూపర్ ట్యాక్స్‘ని విధిస్తే దేశ ఆదాయంలో 0.5 శాతం మేర సమకూరగలదని, సామాన్య ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉండే పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థికంగా వెసులుబాటు లభించగలదని నివేదిక వివరించింది.