అందుకే క్లిష్టమైన, ప్రభావశీల ఆర్ అండ్ డీ ప్రాజెక్టులకు మద్దతిస్తున్నాం
ప్రధాని మోదీ వ్యాఖ్య
రూ.లక్ష కోట్ల రీసెర్చ్, డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ ఫండ్ ప్రారంభం
న్యూఢిల్లీ: పరిశోధన అభివృద్ధి రంగంలో భారత్‌ను అగ్రగామి శక్తిగా అవతరింపజేయడమే లక్ష్యంగా నూతనంగా పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ మూలనిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పరిశోధనాభివృద్ధిలో ప్రైవేట్ రంగ పెట్టుబడుల ప్రవాహాన్ని ఉరకలెత్తించే ఉద్దేశంతోనే రూ.1 లక్ష కోట్లతో రీసెర్చ్, డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ మూలనిధిని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో మొట్టమొదటి ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. అదే కార్యక్రమంలో పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ మూలనిధిని ఆవిష్కరించారు. ఈ సదస్సులో విధాన కర్తలు, ఆవిష్కర్తలు, అంతర్జాతీయ దార్శనికులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు.  
శాస్త్రసాంకేతిక పవర్‌హౌస్‌గా ఎదగాలి 
‘‘ భారత్ శాస్త్రసాంకేతిక రంగంలో శక్తికేంద్రంగా అవతరించాలి. ఈ మేరకు పరిశోధనాభివృద్ధిలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. భారత అద్భుత ప్రగతికి బాటలుపడేలా ఆధునిక ఆవిష్కరణల వాతావరణాన్ని సృష్టించేందుకు కేంద్రప్రభుత్వం విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచం మునుపెన్నడూలేనంతటి వేగవంతమైన మార్పులను చూస్తోంది. 
ఈ 21వ శతాబ్దంలో కొత్తగా పుట్టుకొస్తున్న శాస్త్రసాంకేతిక ఆవిష్కరణలను మరింత మెరుగుపరిచేందుకు ప్రపంచం నలుమూలల నుంచి మేధోవర్గం ఒక్కచోటకు చేరి సమాలోచనలు చేయాల్సిన తక్షణావసరం ఏర్పడింది. ఈ సదస్సు ఏర్పాటుచేయడానికి ముఖ్య కారణం కూడా ఇదే. లక్ష కోట్ల రూపాయల మూల నిధి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. అవకాశాల గనిని తవి్వతీస్తుంది. ప్రభుత్వరంగంలోనే కాదు ఇకపై ప్రైవేట్‌రంగంలోనూ అది్వతీయమైన పరిశోధనాభివృద్ధి జరగాలి. అదే మా లక్ష్యం’’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.  
పోషకాల భద్రతపైనా శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలి 
‘‘ఇన్నాళ్లూ భారత్‌లో ఆహార భద్రతపై సాగురంగ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇకపై పోషకాల పరిరక్షణ కోణంలోనూ శోధన సాగించాలి. ప్రపంచ పోషకాహార లోపాన్ని అధిగమించేలా పోషకాలు సమృద్ధిగా ఉండే నవతరం పంటలను సైతం భారత్ పండించగలదని శాస్త్రవేత్తలు నిరూపించి చూపాలి. అతి కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ భూసారాన్ని కాపాడుతూ సేంద్రీయ ఎరువులను వాడేలా కొత్త ఆవిష్కరణలు చేయలేరా? ఒక్కో రోగి అవసరాలకు తగ్గట్లు అధునాతన ఔషధాలు, రోగ నిర్ధారణ విధానాలను ఆవిష్కరిస్తూ భారత్ తన జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించగలదా? అందుబాటు ధరల్లోకి బ్యాటరీల వంటి శుద్ధ ఇంధన నిల్వ ఆవిష్కరణలను భారత్ చేయగలదా? అంటే తప్పకుండా ఆ పనిచేయగలదు’’ అని మోదీ ధీమా వ్యక్తంచేశారు.
అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టులకు ప్రాధాన్యం 
‘‘తొలిసారిగా ఇంతటి మూల నిధిని ప్రత్యేకంగా అత్యంత క్లిష్టమైన, అత్యంత ప్రభావవంతమైన ప్రాజెక్టుల కోసం భారత్ కేటాయిస్తోంది. దీంతో ఈ రంగంలో ప్రైవేట్ పరిశోధనలు ఊపందుకుంటాయి. పరిశోధన అనుకూల వాతావరణ కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దీంతో భారత్‌లో అధునాతన ఆవిష్కరణ వాతావరణం విస్తరిస్తుంది. ఈ దార్శనికత కార్యరూపం దాల్చేందుకు ఆర్థిక నియంత్రణలు, సమీకరణ విధానాలను అత్యంత సరళీకరిస్తున్నాం.
తగు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందజేస్తాం. పరిశోధనలకు కావాల్సిన తగు విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతిని అనుమతిస్తాం. సరకు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం. తద్వారా పరిశోధనశాలల్లోని నూతన ఆవిష్కరణ తాలూకు నమూనాలు మెరుపువేగంతో మెరుగులు దిద్దుకుని విశ్వవిపణిలోకి అందుబాటులోకి వస్తాయి’’అని మోదీ అన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
