మూడో భారీ ఎకానమీగా భారత్‌! | Nirmala Sitharaman reaffirmed that India become world third largest economy | Sakshi
Sakshi News home page

మూడో భారీ ఎకానమీగా భారత్‌!

Nov 5 2025 7:55 AM | Updated on Nov 5 2025 9:41 AM

Nirmala Sitharaman reaffirmed that India become world third largest economy

త్వరలోనే సాధిస్తాం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ త్వరలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు. వివిధ అంశాల్లో భారత్‌ చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తోందని ఆమె పేర్కొన్నారు. 2014లో పదో స్థానంలో ఉన్న భారత్‌ క్రమంగా అయిదు, నాలుగో స్థానాలకు ఎదిగిందని, త్వరలోనే మూడో స్థానానికి చేరుతుందని చెప్పారు. భారతీయులంతా తమ సామర్థ్యాలపై, దేశ ఆర్థిక సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉండాలని ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ (డీఎస్‌ఈ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి సూచించారు. బయటి వ్యక్తుల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

‘140 కోట్ల జనాభా గల మన దేశాన్ని నిర్జీవ ఎకానమీగా ఎవరైనా ఎలా అనగలరు? బయటి నుంచి ఎవరైనా ఏవైనా మాట్లాడొచ్చు గాక, కానీ మన కృషి, మన విజయాలను మనం తక్కువ చేసుకోరాదు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కృషి చేస్తున్న మనందరికీ మనం సొంతంగానే లక్ష్యాలను సాధించగలమనే ఆత్మవిశ్వాసం ఉండాలి‘ అని మంత్రి చెప్పారు. వృద్ధి సాధనలో టెక్నాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. సాంకేతిక లేకపోయి ఉంటే స్థలం, కారి్మక శక్తి, పెట్టుబడులు నిరుపయోగంగా ఉండేవని వివరించారు.  

అన్నింటా సాంకేతికత

చిన్న రైతు పొలాన్ని గుర్తించడం నుంచి కొత్త మోడల్స్‌ను అత్యంత వేగంగా కృత్రిమ మేథ తీర్చిదిద్దుతున్న తయారీ రంగం వరకు అన్నింటా సాంకేతికత కీలకంగా ఉంటోందని మంత్రి చెప్పారు. కృత్రిమ మేథ వల్ల ఉద్యోగాలు పోతాయని కొందరిలో ఆందోళన నెలకొన్నప్పటికీ మరికొందరు మాత్రం ఏఐని ఉపయోగించి దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరిస్తున్నారని తెలిపారు. భారత్‌లో పరిశోధనలు నిర్వహించడంపై, వర్ధమాన దేశాలకు అనువైన మోడల్స్‌ను రూపొందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.  

ద్రవ్య లోటు లక్ష్యాన్ని సాధిస్తాం..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పక సాధించగలదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2024–25లో 4.8 శాతంగా ఉన్న ద్రవ్య లోటును ఈసారి 4.4 శాతానికి (సుమారు రూ. 15.69 లక్షల కోట్లు) పరిమితం చేయాలని బడ్జెట్‌లో ప్రభుత్వం నిర్దేశించుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ఆర్థిక సమ్మిళితత్వం, జాతీయ ప్రయోజనాల లక్ష్యాలకు భంగం వాటిల్లుతుందన్న ఆందోళనలను ఆమె తోసిపుచ్చారు. బ్యాంకులను జాతీయీకరణ చేసి 50 ఏళ్లు గడిచినా ఆర్థిక సమ్మిళితత్వ విషయంలో ఆశించిన ఫలితాలు కనిపించలేదని..వాటిని ప్రొఫెషనల్‌ విధానంలో తీర్చిదిద్దిన తర్వాత నుంచి చక్కని ఫలితాలు కనిపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: గోపీచంద్‌ హిందూజా కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement