గృహ విక్రయాలు, ఆఫీస్‌ అద్దెలపై కరోనా పడగ

Due To Covid 19 House Sales Are Declined Compared To Last Year  - Sakshi

జూలై– సెప్టెంబర్‌ త్రైమాసికంలోవరుసగా 43 శాతం, 70 శాతం డౌన్‌ 

ఎనిమిది ప్రధాన నగరాల పరిస్థితిపై నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక  

న్యూఢిల్లీ:  కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో భారత్‌ ఎనిమిది ప్రధాన నగరాల్లో 2020 జూలై–సెప్టెంబర్‌ (2019 ఇదే కాలంతో పోల్చి) మధ్య గృహ విక్రయాలు 43 శాతం పడిపోయాయి. కార్యాలయాల (స్పేస్‌) అద్దెల  విషయంలో 70% క్షీణ రేటు నమోదయ్యింది. కరోనాను ఎదుర్కొనేందుకు అమలు చేసిన కఠిన లాక్‌డౌన్‌ పర్యవసానాల నేపథ్యం ఇది. అయితే లాక్‌డౌన్‌ అమలు జరిగిన ఏప్రిల్‌–జూన్‌ కాలంతో పోల్చితే, తాజా సమీక్షా త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌ మధ్య పరిస్థితి కొంత బాగుండడం ఊరటనిస్తున్న అంశం. వరుస త్రైమాసికాల ప్రాతిపదికన చూస్తే, జూలై– సెప్టెంబర్‌ మధ్య గృహ విక్రయాలు మూడు రెట్లు పెరిగితే, ఆఫీస్‌ స్పేస్‌ లీజ్‌ విషయంలో  81%  వృద్ధి నమోదయ్యింది.   రియల్టీ దిగ్గజ సంస్థ– నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సర్వే నివేదిక ఈ అంశాలను వెలువరించింది. సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... 2020 జూలై–సెప్టెంబర్‌ మధ్య ఎనిమిది నగరాల్లో గృహ విక్రయాలు 43 శాతం పడిపోయి 33,403గా నమోదయ్యాయి. 2019 ఇదే కాలంలో ఈ విక్రయాల సంఖ్య 58,183.  ఇక ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ విషయానికి వస్తే, 15.7 మిలియన్ల చదరపు అడుగుల నుంచి 4.7 మిలియన్ల చదరపు అడుగులకు  పడిపోయింది.

అనరాక్,  ప్రాప్‌ఈక్విటీలూ ఇదే చెప్పాయ్‌... 
దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్‌ మధ్య ఇళ్ల అమ్మకాల విషయంలో ఇప్పటికే ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్, రియల్‌ ఎస్టేట్‌ రంగ సమాచార విశ్లేషణా సంస్థ  ప్రాప్‌ఈక్విటీలు తమ నివేదికలను విడుదల చేశాయి.  ఈ కాలాన్ని వార్షికంగా పరిశీలిస్తే, ఇల్లు/ప్లాట్ల అమ్మకాలు 53% పడిపోయి 78,472 నుంచి 50,983 చేరినట్లు ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ , చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణెలను ఈ సంస్ధ పరిగణనలోకి తీసుకుంది. అయితే  జూన్‌ క్వార్టర్‌లో నమోదైన విక్రయాలు 24,936 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో రెట్టింపయ్యాయని  తెలిపింది.

ఇక అనరాక్‌ నివేదికను తీసుకుంటే,  సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 46% పతనంతో  29,520 యూనిట్లు అమ్ముడపోయాయని, క్రితం ఏడాది ఇదే కాలంలో  అమ్మకాలు 55,080 యూనిట్లని తెలిపింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణెలను సంస్థ పరిగణనలోకి తీసుకుంది. జూన్‌ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు కేవలం 12,730 యూనిట్లుగా పేర్కొంది. కాగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోందని, కరోనా తర్వాత భారీ సంఖ్యలో చిన్న పట్టణాలకు తిరిగి వలసపోవడమే కారణమని హౌసింగ్‌ డాట్‌ కామ్‌ ఇటీవల ఆవిష్కరించిన నివేదిక  తెలియజేసింది.

కష్టాలు ఉన్నాయ్‌! 
'జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో సంఖ్యలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, కష్టాలు తొలగిపోలేదు. కమర్షియల్‌ లీజింగ్‌ క్రియాశీలత కుదుటపడుతోంది. గృహ అమ్మకాలు, ఆఫీస్‌ లీజింగ్‌ విషయంలో 2019 స్థాయిని 2021లో చేరుకోవచ్చు. 2019కన్నా మెరుగ్గా పరిస్థితి ఉండే అవకాశాలూ లేకపోలేదు' అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ  శిశిర్‌ బైజాల్  అన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top