డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 1,342 కోట్లు | Dr Reddy Q2 net slips to RS 1342 cr on record sales | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 1,342 కోట్లు

Nov 6 2024 5:27 AM | Updated on Nov 6 2024 5:27 AM

Dr Reddy Q2 net slips to RS 1342 cr on record sales

క్యూ2లో 9 శాతం డౌన్‌ 

ఆదాయం రూ. 8,016 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) రూ. 1,342 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 1,480 కోట్లతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. గ్లోబల్‌ జనరిక్స్‌ దన్నుతో సమీక్షాకాలంలో ఆదాయం రూ. 6,880 కోట్ల నుంచి సుమారు 17 శాతం వృద్ధి చెంది రూ. 8,016 కోట్లకు పెరిగినట్లు మంగళవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ తెలిపింది. 

వివిధ వ్యాపార విభాగాలవ్యాప్తంగా మెరుగైన వృద్ధిని కొనసాగించినట్లు సంస్థ కో–చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ తెలిపారు. నికోటినెల్‌ తదితర బ్రాండ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశామని, భవిష్యత్‌ వృద్ధి చోదకాల విషయంలో పురోగతి సాధించామని ఆయన పేర్కొన్నారు. సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, ప్రధాన వ్యాపారాలను బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టడాన్ని కొనసాగిస్తామని ప్రసాద్‌ వివరించారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం తదితర అంశాలపై ఈ ఆర్థిక సంవత్సరం రూ. 2,500 కోట్ల మూలధన వ్యయాలను చేయనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ తెలిపారు.  

మరిన్ని విశేషాలు.. 
క్యూ2లో గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఆదాయం 17 శాతం పెరిగి రూ. 6,108 కోట్ల నుంచి సుమారు రూ. 7,158 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్‌ 17 శాతం పెరిగి రూ. 3,728 కోట్లకు చేరింది. అమెరికాలో నాలుగు కొత్త ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. క్యూ2లో దేశీయంగా మూడు కొత్త బ్రాండ్లను కంపెనీ ప్రవేశపెట్టింది.  

రిటుగ్జిమాబ్‌ బయోసిమిలర్‌కి యూరోపియన్‌ కమిషన్‌ నుంచి మార్కెటింగ్‌ ఆథరైజేషన్‌ లభించింది. అలాగే, గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ ఔషధం వొనొప్రాజాన్‌ను భారత్‌లో విక్రయించేందుకు టకెడా సంస్థతో లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.  కంపెనీ షేరు బీఎస్‌ఈలో స్వల్పంగా పెరిగి రూ. 1,273 వద్ద ముగిసింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement