డాక్టర్‌ రెడ్డీస్‌ రూ. 1,500 కోట్ల పెట్టుబడులు

Dr Reddy Investment 1500 Cr To Biosimilars, Injectables - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) వ్యాపార విస్తరణపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇందులో సింహభాగం బయోసిమిలర్స్, ఇంజెక్టబుల్స్‌ తదితర విభాగాల సామర్థ్యాల పెంపు కోసం వినియోగించనుంది. అలాగే ప్రస్తుత ప్లాంట్ల విస్తరణ, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలను మెరుగుపర్చుకోవడం, డిజిటైజేషన్‌ ప్రాజెక్టులు మొదలైన వాటిపైనా ఇన్వెస్ట్‌ చేయనుంది. ఆనలిస్ట్‌లతో సమావేశంలో సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పరాగ్‌ అగర్వాల్‌ ఈ విషయలు తెలిపారు. 

ఏడాదికి 30–40 ఉత్పత్తులు కాకుండా అర్ధవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్న 20–25 ఉత్పత్తులనైనా ప్రవేశపెట్టడంపై మరింతగా దృష్టి సారిస్తున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ తెలిపారు. పనితీరు అంతగా బాగాలేని కొన్ని బ్రాండ్లను సరిచేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆయన వివరించారు. గత కొన్నేళ్లుగా పాటిస్తున్న వైవిధ్య వ్యాపార వ్యూహాల కారణంగా కేవలం ఒక మార్కెట్‌ లేదా ఒక నిర్దిష్ట అవకాశంపై ఆధారపడే పరిస్థితులను, రిస్కులను తగ్గించుకోగలిగామని ఇజ్రేలీ చెప్పారు. ప్రస్తుత భౌగోళిక .. రాజకీయ .. ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు మొదలైన సవాళ్లు నెలకొన్న కష్టసమయంలోనూ వృద్ధి సాధించేందుకు ఈ వ్యూహాలే తమకు తోడ్పడగలవని పేర్కొన్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top