డీజిల్‌ వాహనాలను నిషేధించండి.. కేంద్రం వద్దకు కీలక నివేదిక!

Diesel Vehicle Ban By 2027 - Sakshi

న్యూఢిల్లీ: పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో డీజిల్‌ ఆధారిత ఫోర్‌ వీలర్లను 2027 నాటికి నిషేధించాలని చమురు మంత్రిత్వ శాఖ సూచించింది. ఎలక్ట్రిక్, గ్యాస్‌ ఆధారిత వాహనాలను ప్రోత్సహించాలని చమురు మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ తరుణ్‌ కపూర్‌ నేతృత్వంలోని కమిటీ విన్నవించింది. ‘ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌తో తయారైన మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాల తయారీని 2035 నాటికి దశలవారీగా నిలిపివేయాలి.

సుమారు 10 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ సిటీ బస్సులను నూతనంగా జోడించకూడదు. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ ఆధారిత ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ సరైన పరిష్కారంగా ప్రచారం చేయాలి.

చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్‌!

మధ్యంతర కాలంలో మిశ్రమ నిష్పత్తిని పెంచుతూ ఇథనాల్‌తో కూడిన ఇంధనానికి విధాన మద్దతు ఇవ్వాలి. డీజిల్‌తో నడిచే ఫోర్‌ వీలర్లను వీలైనంత త్వరగా తొలగించవచ్చు. అందువల్ల 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, అధిక కాలుష్యం ఉన్న అన్ని పట్టణాలలో డీజిల్‌తో నడిచే నాలుగు చక్రాల వాహనాలపై నిషేధాన్ని ఐదేళ్లలో అమలు చేయాలి.

ఫ్లెక్స్‌ ఫ్యూయల్, హైబ్రిడ్‌లతో కూడిన వాహనాలను ప్రోత్సహించేలా స్వల్ప, మధ్యస్థ కాలంలో ప్రచారం చేయాలి. పన్నుల వంటి ఆర్థిక సాధనాల ద్వారా ఇది చేయవచ్చు. ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ఫేమ్‌ను కొనసాగించాలి. నగరాల్లో సరుకు డెలివరీ కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలకు మాత్రమే కొత్తగా రిజిస్ట్రేషన్‌లకు అనుమతించాలి. కార్గో తరలింపు కోసం రైల్వేలు, గ్యాస్‌తో నడిచే ట్రక్కులను ఎక్కువగా ఉపయోగించాలి. ఈ సూచనలు అమలైతే 2070 నాటికి ఉద్గారాల విషయంలో భారత్‌ నెట్‌ జీరో స్థాయికి చేరుకుంటుంది’ అని నివేదిక పేర్కొంది.

చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్‌ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top