పెట్టుబడి.. బంగారం..!

Demand For Gold ETFs And SGBs In Investment Sector - Sakshi

గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, ఎస్‌జీబీలకు ఆదరణ 

వీటిలోకి పెరుగుతున్న పెట్టుబడులు 

2020–21లో 46 టన్నుల కొనుగోళ్లు 

ఇక ముందూ ఇదే ధోరణి ఉంటుందని అంచనా  

న్యూఢిల్లీ: నేరుగా బంగారాన్ని కొనుగోలు చేయడం కాకుండా.. పెట్టుబడుల కోణంలో సౌర్వభౌమ బంగారం బాండ్లు(ఎస్‌జీబీ), బంగారం ఎక్స్‌ఛేంజ్‌‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌)లో ఇన్వెస్ట్‌ చేసే ధోరణి విస్తృతమవుతోంది. ఈ ఏడాది ఎస్‌జీబీ, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లను పరిశీలిస్తే ఇదే తెలుస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఎస్‌జీబీ ఇష్యూల రూపంలో రూ.16,049 కోట్ల నిధులను సమీకరించింది. అంటే 32.4 టన్నులకు సమానమైన ఎస్‌జీబీలను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. తదుపరి ఎస్‌జీబీ విక్రయం ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఉండనుంది.

ఇక గోల్డ్‌ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లను కూడా కలిపి చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 46 టన్నుల మేర పేపర్‌ బంగారం (పత్రాల రూపంలో) కొనుగోళ్లు నమోదయ్యాయి. భౌతికంగా పెట్టుబడి కోణంలో కొనుగోలు చేసే బంగారం ఇప్పటికీ పెద్ద మొత్తంలోనే ఉంటోంది. 2020–21 మొత్తం మీద 135 టన్నుల మేర బంగారం ఈ రూపంలో కొనుగోలుదారులను చేరొచ్చని అంచనా. 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ నాటికి భౌతిక బంగారంలో 102 టన్నుల మేర కొనుగోళ్లు జరిగాయి.  

గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.6,062 కోట్లు 
గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.6,062 కోట్ల మేర (12.9 టన్నులు) పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల రాక పెరగడం వరుసగా ఇది రెండో ఆర్థిక సంవత్సరం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం మీద 14 టన్నుల మేర పెట్టుబడులు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వస్తాయని అంచనా. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) డేటా ప్రకారం ఈటీఎఫ్‌లు పేపర్‌గోల్డ్‌ కిందకే వస్తాయి. ‘‘ఎస్‌జీబీలు ఇప్పుడు బంగారం పెట్టుబడుల్లో ప్రధాన సాధనంగా అవతరించాయి. బంగారంలో పెట్టుబడుల ప్రాధాన్యతను కరోనా మహమ్మారి మరోసారి తెరముందుకు తీసుకొచ్చింది.

లాక్‌డౌన్‌ల వల్ల చాలా మంది బంగారం పెట్టుబడుల కోసం పేపర్‌ సాధనాలను ఆశ్రయించారు. ఇక ముందూ ఎస్‌జీబీలకు డిమాండ్‌ బలంగానే ఉంటుందని అంచనా వేస్తున్నాము’’ అని మెటల్‌ ఫోకస్‌ ప్రధాన సలహాదారు చిరాగ్‌సేత్‌ తెలిపారు. ఈ నెలలో ఎస్‌జీబీల కొనుగోళ్లు 3.23 టన్నుల మేర నమోదయ్యాయి. గతేడాది ఆగస్ట్‌ ఎస్‌జీబీ ఇష్యూలో 6.35 టన్నుల బంగారం బాండ్లను ఆర్‌బీఐ జారీ చేసింది. ఆ తర్వాత అత్యధిక కొనుగోళ్లు ఈ నెల్లోనే (మార్చి1–5) నమోదయ్యాయి. ఎస్‌జీబీ పథకం 2015 నవంబర్‌లో ప్రారంభమైన తర్వాత.. 32.4 టన్నులతో అత్యధిక కొనుగోళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21)లోనే నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా మార్చిలో ఎక్కు వ కొనుగోళ్లకు కారణం.. పసిడి ధరలు దిగిరా వడం ఒక కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం. 

ధరలు మరింత తగ్గుతాయా? 
బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండడం వ్యాల్యూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్‌లో బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుతూ ఉండడం బంగారం ధరలు మరింత తగ్గుతాయన్న ఆందోళనలకు కారణమవుతోందని పేర్కొన్నారు. ‘‘బంగారం ఎన్నో రిస్క్‌లను ఎదుర్కొంటోంది. బిట్‌కాయిన్‌కు ప్రాచుర్యం పెరుగుతుండడం కూడా బంగారానికి ఒక ముప్పు. బాండ్‌ ఈల్డ్స్‌ లేదా వడ్డీ రేట్లు పెరిగే ధోరణి బంగారానికి బదులు బాండ్ల పట్ల ఆకర్షణను పెంచొచ్చు’’ అని అమెరికా కేంద్రంగా పనిచేసే అరోరా రిపోర్ట్‌ వ్యవస్థాపకుడు నిగమ్‌ ఆరోరా తెలిపారు.

బంగారానికి గతంలో మాదిరి ఆకర్షణీయమైన రోజులు ముగిసినట్టేనన్నది బిట్‌కాయిన్‌ మద్దతుదారుల అభిప్రాయమని ఆరోరా పేర్కొన్నారు. గణనీయమైన పెట్టుబడులు పుత్తడి నుంచి ఇప్ప టికే బిట్‌కాయిన్‌లోకి వెళ్లినట్టు చెప్పారు. ఇకపైనా కొత్త పెట్టుబడుల్లో అధిక భాగం బిట్‌కాయిన్లలోకి వెళ్లొచ్చన్నారు. సాధారణంగా ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తుంటే బంగారం వన్నె తగ్గడం మామూలే. ఈక్విటీలు బేలచూపులు చూసే సమయంలో పసిడి మెరుస్తుంటుంది.  అయితే, బంగారాన్ని కనిష్ట ధరల వద్ద కొనుగోలు చేయొచ్చని ఆరోరా సూచించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top