ఫాస్టాగ్‌ అకౌంట్ల నుంచి జరిమానాలు కట్‌.. ట్రాఫిక్‌ ఉల్లంఘనుల ఆటకట్టు! 

Deducting traffic rules violation fines from FASTag accounts - Sakshi

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారి ఆటకట్టించేందుకు బెంగళూరు పోలీసులు సూపర్‌ ఐడియా వేశారు. బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేలో ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లే వాహనదారులకు వారి ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలను ఉపయోగించి జరిమానా విధించాలని ప్రతిపాదించారు. 

అతివేగం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కొన్ని రోజులుగా పలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI) ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, వాహనం నడుపుతున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు.

ఇదీ చదవండి  ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొన్న వారికి షాక్‌! డిస్కౌంట్‌ డబ్బు వెనక్కి కట్టాలి? 

ఇక టూవీలర్లు, ట్రాక్టర్లు, ఆటోలు వంటి నెమ్మదిగా కదిలే వాహనాల వల్ల ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా వాటిని ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్లకుండా నిషేధించారు. తాజాగా  ఎక్స్‌ప్రెస్‌వేపై ఓవర్‌స్పీడ్‌కు కళ్లెం వేయడానికి వాహనాల ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేసేందుకు ప్రతిపాదించారు. 

ఈ ఆలోచన ఇంకా ప్రతిపాదన స్థాయిలో ఉండగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటువంటి ఆలోచనను అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని సమర్ధవంతంగా అమలు చేస్తే జరిమానా వసూలు సులభతరంగా మారుతుంది. వాహనాలను మాన్యువల్‌గా ఆపి జరిమానాలు విధించే అవసరం ఉండదు. అయితే నేరుగా ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా ద్వారా జరిమానాలను వసూలు చేయడం అనేది ప్రధాన గోప్యతా సమస్యను లేవనెత్తే​ అవకాశం ఉంది.

ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాల నుంచి వసూలు చేస్తున్న జరిమానాల మొత్తం ఎన్‌హెచ్‌ఏఐకి వెళుతోందని, అలా కాకుండా ప్రభుత్వానికి జమ చేయాలనేది తమ ప్రణాళిక అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top