Dealroom.co: డిజిటల్‌ షాపింగ్‌ పెట్టుబడుల్లో ఇండియా రికార్డ్‌!

Dealroom.co Report Says India stood second position in Digital Shopping - Sakshi

2021లో 22 బిలియన్‌ డాలర్ల     ఇన్వెస్ట్‌మెంట్స్‌ 

వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడుల్లో బెంగళూరు జోరు  

లండన్‌: డిజిటల్‌ షాపింగ్‌ కంపెనీలలో పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయ మార్కెట్‌గా నిలుస్తోంది. దీంతో 2021లో 175 శాతం అధికంగా 22 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ తరలి వచ్చాయి. 2020లో 8 బిలియన్‌ డాలర్లు మాత్రమే లభించాయి. వెరసి ప్రపంచస్థాయిలో యూఎస్‌ తదుపరి రెండో ర్యాంకులో నిలిచింది. గతేడాది యూఎస్‌లోని డిజిటల్‌ షాపింగ్‌ కంపెనీలు 51 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోగా.. చైనా సంస్థలు 14 బిలియన్‌ డాలర్లు, యూకే కంపెనీలు 7 బిలియన్‌ డాలర్లు చొప్పున ఇన్వెస్ట్‌మెంట్స్‌ అందుకున్నాయి. లండన్‌ అండ్‌ పార్టనర్స్‌ రూపొందించిన డీల్‌రూమ్‌.కో పెట్టుబడుల గణాంకాలివి. 

14 బిలియన్‌ డాలర్లు 
అంతర్జాతీయంగా 2021లో డిజిటల్‌ షాపింగ్‌ కంపెనీలలో పెట్టుబడులకు బెంగళూరు టాప్‌లో నిలిచింది. 14 బిలియన్‌ డాలర్ల వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) పెట్టుబడులను సాధించింది. 2020లో బెంగళూరు కంపెనీలు 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. తాజా జాబితాలో న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, లండన్, బెర్లిన్‌ 2 నుంచి 5వరకూ స్థానాలు సాధించాయి. ఈ బాటలో దేశీయంగా గురుగ్రామ్‌ 4 బిలియన్‌ డాలర్లతో 7వ ర్యాంకులో, 3 బిలియన్‌ డాలర్లతో ముంబై 10వ పొజిషన్లో నిలిచాయి. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌ సేవలకు డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈకామర్స్‌ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వెల్లువెత్తినట్లు డీల్‌రూమ్‌.కో గణాంకాలు తెలియజేశాయి. 

యూనికార్న్‌లకూ.. 
భవిష్యత్‌లో అత్యధిక యూనికార్న్‌ స్టార్టప్‌లకు నిలయం కాగల నగరాలలోనూ బెంగళూరుకు జాబితాలో ప్రాధాన్యత లభించింది. లండన్‌ తదుపరి 5వ ర్యాంకును కైవసం చేసుకుంది. ప్రస్తుతం దేశీయంగా యూనికార్న్‌ స్టార్టప్‌ల సంఖ్య అత్యధికంగా గల నగరాలలో బెంగళూరు 19 సంస్థలతో 6వ ర్యాంకు సాధించింది. ఇక 13 యూనికార్న్‌లతో గురుగ్రామ్‌ 7వ ర్యాంకులో నిలవగా.. 7 సంస్థలతో ముంబై 14వ పొజిషన్‌కు చేరుకుంది. గురుగ్రామ్‌లో యూనికార్న్‌ల సంఖ్య 2020లో 3 మాత్రమే కావడం గమనార్హం! కాగా.. 2021లో డిజిటల్‌ షాపింగ్‌లో గ్లోబల్‌ వీసీ పెట్టుబడులు దాదాపు రెట్టింపై 140 బిలియన్‌ డాలర్లను తాకాయి. 2020లో ఇవి 68 బిలియన్‌ డాలర్లు మాత్రమే.

చదవండి: విదేశాల్లో మనోళ్ల పెట్టుబడులు తగ్గాయ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top