Happy Birthday Chiranjeevi: గెలుపు పందెం.. ‘గాంధీ’ చెప్పిన వ్యాపార సూత్రాలివే!

Chiranjeevi Birthday Challenge Movie From Business Lessons - Sakshi

Happy Birthday Chiranjeevi: ఓలా ఈ-బైక్‌.. ఇండియన్‌ వెహికిల్‌ మార్కెట్‌లో ఒక సంచలనం. కేవలం రూ. 499లతో ప్రీ-బుకింగ్‌తో 24 గంటల్లో వెయ్యి నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లు. సంచలనాలకు తెరలేపి.. ఓ చెదరని రికార్డును నెలకొల్పింది ఓలా. కానీ, 37 ఏళ్ల క్రితమే ఇలాంటి సినారియోను చూపించింది ఓ తెలుగు సినిమా. స్కూటర్‌ ఫ్యాక్టరీకి లైసెన్స్‌ రావడం, ఆ వెంటనే స్కూటర్లు కావాల్సిన వాళ్లు మూడు రోజుల ముందు ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చని ప్రకటన ఇవ్వడం, ఆ కాలానికి తగ్గట్లు డ్రాఫ్ట్‌లు, చెక్‌లు ఎలాంటి పేమెంట్లు అయినా యాక్సెప్ట్‌ చేయడం. వెరసి ఈ ప్రకటనతోనే హీరో తాను అనుకున్న యాభై లక్షలు సంపాదించడం, పందెంలో నెగ్గడం.. ‘ఛాలెంజ్‌’ ద్వారా గాంధీ పాత్ర చెప్పిన గెలుపు ‘చిరు’ పాఠం చాలామందికి గుర్తుండే ఉంటుంది. 

చిరంజీవి వరుస కమర్షియల్‌ సక్సెస్‌ సినిమాల్లో ‘ఛాలెంజ్‌’ ఒకటి. యండమూరి ‘డబ్బు టూ ది పవర్‌ ఆఫ్‌ డబ్బు’ నవలకు సినిమాటిక్‌ మార్పుల ఆధారంగా కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. అప్పట్లో ఓ సెన్సేషన్‌. నిరుద్యోగ యువత బలహీనతలతో ఆడుకోవాలని ప్రయత్నించే బడావ్యాపారి రామ్మోహన్‌రావు ప్రకటనలకు.. టిట్‌ ఫర్‌ ట్యాట్‌ ఇస్తాడు నిరుద్యోగి(మొదటి సీన్‌ తర్వాత అనాథ కూడా) గాంధీ. ఆపై ఐదేళ్లలో యాభై లక్షల సంపాదన పందెం.. ప్రతిగా రామ్మోహన్‌రావు కూతురు హారికతో వివాహం ‘ఛాలెంజ్‌’తో అసలు కథ మొదలవుతుంది. ఈ పందెంలో గాంధీని వెనక్కిలాగాలని రామ్మోహన్‌రావు చేసే ప్రయత్నమంటూ ఉండదు. కానీ, తన బుద్ధితో.. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపి పందెంలో గెలుస్తాడు గాంధీ. బలమైన కథాకథనాలు, బలమైన క్యారెక్టర్లు, సంగీతం.. అన్నింటికి మించి నిరుద్యోగ రేటు ఎక్కువగా టైమింగ్‌లో రిలీజ్‌ కావడం ఛాలెంజ్‌ సక్సెస్‌కు కారణాలయ్యాయి.

గాంధీ బుర్రకు సలాం
తెలివితేటలు ఉంటే డబ్బు దానంతట అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. అసాధ్యం అనే పదాన్ని అని చెరిపేస్తున్న రోజుల్లో.. యువత సాధించలేనిది ఏదీ లేదు, డబ్బు కంటే విలువైనవి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి..  ఇలాంటి సందేశాలెన్నో ఛాలెంజ్‌ ఇచ్చింది. అదే టైంలో పైసా పెట్టుబడిలేని ‘సలహా ఇవ్వడం’ (కన్సల్టెన్సీ తరహా కాన్సెప్ట్‌) అనే వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించే హీరో, బిజినెస్‌ ట్రిక్‌ల ద్వారా ప్రత్యర్థిని దెబ్బకొట్టే సీక్వెన్స్‌లు, అగ్రెసివ్‌గా గాంధీ పాత్ర చెప్పే డైలాగులు, కమర్షియల్‌ ఎలిమెంట్లు.. అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
 

పది పైసల నుంచి మొదలు.. 
తల్లి మందులకు డబ్బుల్లేక దొంగతనం చేసే గాంధీ.. అంత్యక్రియల కోసం వార్డెన్‌ ప్రకాశంతో రాజీపడడం, అదే టైంలో భార్య చికిత్స కోసం వచ్చిన రామ్మోహన్‌రావు దర్పాన్ని ప్రదర్శించడం, తన లెక్కతో హారిక నుంచి డబ్బు రాబట్టుకునే గాంధీ.. అప్పటిదాకా తన నేర్చుకున్న చదువును పక్కనపెట్టి.. జీవిత పాఠంలోకి అడుగుపెడతాడు. తెలివైన లక్ష్మి చెంత చేరి.. ఆమె అభిమానం-ప్రేమను పొందుతాడు. డబ్బు సంపాదించే పందెంలో అవ్వ నుంచి పది పైసలతో కొండంత ఆత్మవిశ్వాసంతో స్ఫూర్తి పొందుతాడు. ప్రత్యర్థి కూతురైన హారిక నుంచి సాయం, లక్ష్మి-విద్యార్థిల సహకారం అందుకుని గెలుపు బావుట ఎగరేస్తాడు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులకు, మానసిక సంఘర్షణలకు లోనవుతాడు గాంధీ.
 

ఛాలెంజ్‌ నేర్పే పాఠాలు
ఐదేళ్లలో యాభై లక్షలు సంపాదిస్తానంటూ గాంధీ ఛాలెంజ్‌ చేసిన తర్వాత అతని మొదటి పెట్టుబడి కేవలం పది పైసలు. అది కూడా గుడి మెట్ల మీద భిక్షం ఎత్తుకునే అవ్వ ఇస్తుంది. దీంతో ఎమోషనల్‌ అయిన గాంధీ తన వ్యాపారంలో అవ్వకు భాగస్వామ్యం ఇస్తానంటూ మాటిస్తాడు. ఆ క్షణంలో ఎమోషనల్‌గా వ్యాపారంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ గాంధీ పాత్ర చక్కగా వివరిస్తుంది.
 ఓ సీన్‌లో జూదానికి సంబంధించిన విషయంలోనూ మెళకువల్ని చెబుతాడు గాంధీ. జూదం నిరంతరం సాగే ప్రక్రియ అని. మన దగ్గరే ఆడేంత డబ్బులు ఉండవని, లాభాల్లో ఉన్నప్పుడే జూదం ఆపడం తెలివైన వాడి లక్షణం అంటూ అవతలి వ్యక్తితో అంటూనే ఓ సలహా ఇస్తుంది గాంధీ పాత్ర.
► ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఎంట్రప్రెన్యూర్‌కి ల్యాండ్‌, లేబర్‌, క్యాపిటల్‌ ఎంతో అవసరం అనేది ప్రాథమిక సూత్రం. దీని ఆధారంగానే తన గాంధీ 50 లక్షల సంపాదన ప్రయత్నాలు మొదలవుతాయి. 
దారితప్పుతున్న నిరుద్యోగ యువతను.. ఓ దారికి తీసుకొచ్చి ప్రభుత్వ పథకానికి ముడి పెట్టి చట్టబద్ధంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో తొలిసారిగా డబ్బు సంపాదన వేట మొదలు పెడతాడు.

వ్యాపారానికి బ్రాండింగ్‌ అనేది ఎంత ముఖ్యమో చెప్పేందుకు వీలుగా ఇళ్లు, కారు కొనుగోలు చేసి, దాని వల్ల వచ్చిన ఇమేజ్‌తో క్యాపిటల్‌ సంపాదనలో పడిపోతాడు
తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో విద్యార్తి వంటి పాత్ర ద్వారా ఓ చక్కని లేబర్‌ని ఎంపిక చేసుకుంటాడు.
► ప్రత్యర్థి రామ్‌మోహన్‌ ప్రమోటర్‌గా ఉన్న బ్యాంకు నుంచే లోను పొందేందుకు గాంధీ, విద్యార్థిలు ఇద్దరు వేర్వేరుగా లోన్‌ కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారంలో శత్రువుకి శత్రువు మిత్రుడు అనే వ్యాపార సూత్రాన్ని పక్కాగా అమలు చేస్తారు. తమ వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి సంపాదిస్తాడు. 
పెట్టుబడి మొత్తం ఒకే చోట పెట్టకూడదనేది వ్యాపారంలో ముఖ్యమైన సూత్రాల్లో ఒకటి. జెఫ్‌ బేజోస్‌, ఎలన్‌మస్క్‌లాంటి కుబేరుల మొదలు షేర్‌ మార్కెట్‌ ఎనలిస్టుల వరకు ప్రతీ ఒక్కరూ చెప్పే మాట ఇదే. అంతేకాదు రకరకాల వ్యాపారాలతో వాళ్లు లాభాలు అర్జిస్తున్నారు కూడా. ఛాలెంజ్‌ గాంధీ సైతం ఓ వైపు పేపర్‌ ఫ్యాక్టరీ పనుల్లో ఉంటూనే మరో వైపు స్కూటర్‌ ఫ్యాక్టరీ పనులు కూడా మొదలెట్టి. తన ప్రత్యర్థికి అందనంత వేగంతో వ్యూహాలు అమలు చేస్తుంటాడు.
షేర్‌ మార్కెట్‌ గురించి అంతగా పరిచయం లేని రోజుల్లో.. దాని గురించి వివరించే ప్రయత్నం చేసిన మొదటి సినిమా కూడా ఇదే. 
► చివరగా.. డబ్బు మీద మనిషికి ఎంత గౌరవం ఉన్నా.. ఈ భూమ్మీద డబ్బు కంటే విలువైనవి ఉన్నాయంటూ రామ్‌మోహన్‌తో చెప్పే ముగింపు ఆకట్టుకుంటుంది. 
  
డబ్బు మోజులో పడి.. 
సంపాదనలో పడ్డ మనిషికి.. మిగతా వాటికి సమయం ఉండదు. ఆఖరికి బంధాలు, విలువల్ని కూడా ఒక్కోసారి పక్కనపెట్టాల్సి వస్తుంది. పేకాట క్లబ్‌ ద్వారా సంపాదించిన డబ్బును చూపించి.. చట్టానికి-న్యాయానికి తేడాలు చెప్పే గాంధీ.. చివరల్లో గడువు దగ్గర పడుతుంటే ఆ రెండూపట్టింపు లేనట్లు వ్యవహరించాడేమో అనిపించకమానదు. దుస్తులు అమ్ముకునే వ్యాపారికి.. అడల్ట్‌ ఐడియా ఇచ్చి ఒకానొక దశలో దిగజారి ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తుంది. కానీ, ఆరాచశక్తులుగా మారే యువతకు అవకాశాల ద్వారా మంచి బాటలోకి తీసుకురావడం, విద్యార్థిని వెన్ను తట్టి ప్రోత్సహించడం ఆకట్టుకుంటాయి. 

చివర్లో ‍వ్యాపార సూత్రాల్ని పక్కాగా పాటించి గెలుపురామ్మోహన్‌రావు అహం-అహంకారం మీద దెబ్బకొట్టడం ఆడియొన్స్‌ను అంతతేలికగా మరిచిపోనివ్వదు. పోటీ ప్రపంచంలో మోసాన్ని మోసం తోనే జయించడం, పోటీ ప్రపంచం దిగజారుడుతత్వం, ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు పాటించాల్సిన సూత్రాలను ఆ కాలానికి తగ్గట్లు చూపించినప్పటికీ.. అవి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటి పరిస్థితులకైనా సరిపోయేవిలా ఉంటాయనడంలో అతిశయోక్తి కాదు. 

- చిరు బర్త్‌డే సందర్భంగా ప్రత్యేక కథనం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top