వంటనూనెల ధరల్ని తగ్గించండి, తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు!

Central Govt Asks Cos To Cut Mrp Of Edible Oils By Up To Rs 10 - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దిగుమతి చేసుకున్న వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా లీటరుకు రూ. 10 వరకూ తగ్గించాలని తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది. అలాగే, ఒక బ్రాండ్‌ ఆయిల్‌పై దేశవ్యాప్తంగా ఒకే ఎంఆర్‌పీ (గరిష్ట చిల్లర ధర) ఉండాలని సూచించింది.

వంటనూనెల తయారీ సంస్థలు, అసోసియేషన్లతో బుధవారం భేటీ అయిన సందర్భంగా కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే ఈ విషయాలు తెలిపారు. గడిచిన వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా రేట్లు 10 శాతం తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాలని, ఎంఆర్‌పీని తగ్గించాలని సూచించినట్లు ఆయన చెప్పారు.

పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ వంటి దిగుమతి చేసుకునే అన్ని రకాల వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా తగ్గిస్తామని ప్రధాన తయారీ సంస్థలన్నీ హామీ ఇచ్చినట్లు వివరించారు. ఆ తర్వాత మిగతా నూనెల ధరలనూ తగ్గిస్తామని తెలిపినట్లు పాండే చెప్పారు. జూలై 6 నాటి గణాంకాల ప్రకారం పామాయిల్‌ సగటు రిటైల్‌ ధర (లీటరుకు) రూ. 144.16, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ. 185.77, సోయామీన్‌ ఆయిల్‌ రూ. 185.77, ఆవ నూనె రూ. 177.37, పల్లీ నూనె రూ. 187.93గాను ఉంది.  

మరోవైపు, తూకం విషయంలోనూ వస్తున్న ఫిర్యాదులపై కూడా తయారీ సంస్థలతో చర్చించినట్లు వివరించారు. 15 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ప్యాకింగ్‌ చేసినప్పుడు 910 గ్రాముల పరిమాణం ఉన్నట్లు ప్యాకెట్లపై కంపెనీలు ముద్రిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆ ఉష్ణోగ్రతల్లో ఆయిల్‌ వ్యాకోచించడం వల్ల వాస్తవ బరువు 900 గ్రాములే ఉంటుందన్నారు. ఇలాంటివి జరగకుండా 30 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ప్యాకింగ్‌ చేయాల్సి ఉంటుందని పాండే వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top