బిల్డర్స్‌ లాబీని అడ్డుకోండి

Cement Manufacturers in South India form Association on their Own - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘భవన నిర్మాణ వ్యయంలో సిమెంటు పాత్ర అతి స్వల్పం. బిల్డర్లు 100 శాతానికిపైగా మార్జిన్లను ఉంచుకుని ఇళ్ల ధరలను నిర్ణయిస్తున్నారు. పైగా పెరిగిన ఇళ్ల ధరలకు సిమెంటు కంపెనీలను బాధ్యులను చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బిల్డర్లు ఇలా ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ సిమెంటు తయారీ సంస్థల ప్రతినిధులు ఘాటుగా స్పందించారు. కొత్తగా ఏర్పాటైన దక్షిణ భారత సిమెంట్‌ తయారీదారుల సంఘం మంగళవారం వర్చువల్‌గా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బిల్డర్స్‌ లాబీని అడ్డుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని వారు వెల్లడించారు. ‘ప్రతి బిల్డర్‌ ధర విషయంలో పారదర్శకంగా ముందుకు రావడంతో పాటుగా ఇళ్ల ధరలను కనీసం 50% తగ్గించాల్సిందిగా కోరాలి. అదే రీతిలో చెక్‌ ద్వారా లావాదేవీలు జరపకపోతే తగిన చర్యలు తీసుకోవాలి’ అని లేఖ ద్వారా ప్రధానికి విన్నవించామన్నారు. సంఘం ప్రెసిడెంట్, ఇండియా సిమెంట్స్‌ వీసీ, ఎండీ ఎన్‌.శ్రీనివాసన్, వైస్‌ ప్రెసిడెంట్, భారతి సిమెంట్స్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డి, సెక్రటరీ, పెన్నా సిమెంట్స్‌ డైరెక్టర్‌ కృష్ణ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. లేఖలో వెల్లడించిన అంశాలు వారి మాటల్లోనే...

సిమెంట్‌ తయారీ కేంద్రంగా..: 
అసలైన ఆత్మనిర్భర్‌ సాధించిన పరిశ్రమలలో సిమెంట్‌ రంగం ఒకటి. పరిమాణం పరంగా 500 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో భారత్‌ రెండవ స్థానంలో ఉంది. చైనా 2.5 బిలియన్‌ టన్నులతో అగ్రస్ధానంలో, యుఎస్‌ 70 మిలియ న్‌ టన్నులతో 3వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోని కంపెనీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 200 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. లైమ్‌స్టోన్‌ డిపాజిట్లతో కేవలం 7 రాష్ట్రాల్లోనే సిమెంట్‌ ఉత్పత్తి సాధ్యమవుతుంది. భారత్‌ లైమ్‌స్టోన్‌ నిల్వల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడింట ఒకవంతు కలిగి ఉన్నా యి. భారత్‌తోపాటు ఎగుమతుల పరంగానూ భవిష్యత్‌లో సిమెంట్‌ కేంద్రంగా నిలిచే సామర్థ్యం దక్షిణాదికి ఉంది. 

కృత్రిమ ధరలతో విక్రయాలు..:
సిమెంట్‌ పరిశ్రమకు తదనుగుణంగా భారతదేశపు వృద్ధికి సమస్యగా పరిణమిస్తున్నది గృహ రంగంలో వృద్ధి సానుకూలంగా లేకపోవడం. ఇందుకు ఏకైక కారణమేమిటంటే కృత్రిమంగా ఫ్లాట్స్, గృహాలను అధిక ధరలకు విక్రయిస్తుండటమే. క్రెడాయ్‌ మరియు బిల్డర్స్‌ అసోసియేషన్‌ పేరిట స్పష్టంగా బిల్డర్లతో కూడిన బృందం దీని కోసం పనిచేస్తోంది. వీరు ఏకంగా 100%కు పైగా మార్జిన్లును ఉంచుకుని ధరలను నిర్ణయిస్తున్నారు. ఎబిటా మార్జిన్‌ నిర్మాణ సంస్థలకు 35–50 శాతం ఉంటే, సిమెంటు కంపెనీలకు 15 శాతంలోపే ఉంది. దురదృష్టవశాత్తు అధికార యంత్రాంగ లాభదాయక విధానాల కోసమే పాటుపడుతున్న వీరిపై ఎలాంటి కఠినచర్యలనూ తీసుకోలేదు. కొనుగోలుదార్లకు ఫ్లాట్స్, గృహాలను సహేతుక ధరలో విక్రయిస్తే మనీ సర్క్యులేషన్‌ గణనీయంగా వృద్ధి చెందుతుంది. తద్వారా భారతీయ ఆర్ధిక వ్యవస్థ సైతం వృద్ధి చెంది ఉపాధి కల్పనకూ దోహద పడుతుంది. నిర్మాణ రంగం బాగుంటే సిమెంట్‌కు డిమాండ్‌ సైతం పెరుగుతుంది.

నిర్మాణ వ్యయం కంటే అధికంగా.. 
ఓ ఫ్లాట్‌ ధరలో అత్యంత కీలకపాత్ర పోషించేది భూమి. చెన్నైలో అత్యధిక రేటు కలిగిన ప్రాంతంలో భూముల ధరలకు సంబంధించిన మార్గదర్శకాలను మేము పరిశీలించాము. అది చదరపు అడుగుకు రూ.10 వేలు. 2/2.4 ఎఫ్‌ఎస్‌ఐను తీసుకుంటే.. ఓ ఫ్లాట్‌లో అది చదరపు అడుగుకు సుమారు రూ.4,200 అవుతుంది. దీనికి నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.2,000–2,500 జోడిస్తే ఫ్లాట్‌ ఖర్చు గరిష్టంగా చదరపు అడుగుకు రూ.6,700 అవుతుంది. అయితే ఇక్కడ విక్రయ ధర చదరపు అడుగుకు రూ.15–20 వేలు ఉంది.  అమ్ముడు కాకుండా అసాధారణ ఇన్వెంటరీ ఉంది. కానీ బిల్డర్స్‌ లాబీ మాత్రం ధరలను కొద్దిగా కూడా తగ్గడానికి అనుమతించడం లేదు.

లక్షల్లో ఇన్వెంటరీ ఉన్నా.. 
దేశ వ్యాప్తంగా 9 ప్రధాన మార్కెట్లలోనే 75 లక్షల ఫ్లాట్స్‌ అమ్ముడు కాకుండా ఉన్నట్లు అంచనా. దీనిలో అసంపూర్తిగా నిర్మితమైన ఫ్లాట్స్‌ను మినహాయించడం జరిగింది. ఒకవేళ బిల్డర్లు తమ ధరలను తగ్గించుకుంటే ఈ మొత్తం అమ్ముడవుతుంది. రియల్టీ డిమాండ్‌ కూడా పెరుగుతుంది. మధ్య తరగతి, అల్పాదాయ వర్గాలకు ఓ గూడు కూడా లభ్యమవుతుంది. బిల్డర్లు ఇప్పుడు ప్రధానమంత్రి అందుబాటు గృహ పథక ప్రయోజనాలను పొందడమే కాదు.. ప్రజలకు ఈ లబ్ధి అందించేందుకు సైతం నిరాకరిస్తున్నారు. ఎవరైనా దీని గురించి ప్రశ్నిస్తే పెరిగిన ఇన్‌పుట్‌ ధరలు మరీ ముఖ్యంగా సిమెంట్‌ గురించి చెబుతుంటారు. కానీ ఒక చదరపు అడుగు నిర్మించడానికి అరబ్యాగు సిమెంట్‌ మాత్రమే ఖర్చవుతుంది. విక్రయ ధరలో సిమెంట్‌ వాటా కేవలం 1.5–2 శాతం మాత్రమే. ఒకవేళ బస్తాకు రూ.100 సిమెంట్‌ ధర పెరిగినా నిర్మాణ ఖర్చు అడుగుకు రూ.50 మాత్రమే అధికం అవుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top