అమెజాన్‌కు భారీ షాక్ ఇచ్చిన సీసీఐ

CCI suspends Amazon-Future Coupons deal, imposes a penalty of Rs 202 cr - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు సీసీఐ భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్‌సిపిఎల్) మధ్య కుదిరిన ఒప్పందాన్ని 2019లో ఆమోదించిన కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఎఫ్‌సిపిఎల్ తో జరిగిన రూ.1400 కోట్ల ఒప్పందానికి అమెజాన్ ఆమోదం కోరుతూ కీలక సమాచారాన్ని దాచిపెట్టినట్లు ఆరోపిస్తూ సీసీఐ అమెజాన్ కు 60 రోజుల నోటీసు జారీ చేసింది. అప్పటి వరకు ఈ డీల్‌ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేసింది. అలాగే, అమెజాన్‌కు రూ.202 కోట్లు జరిమానా కూడా విధించింది. ఎఫ్‌సిపిఎల్ అనేది ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(ఎఫ్ఆర్ఎల్) ప్రమోటర్ ఎంటిటీ. 

2019లో అమెజాన్-ఎఫ్‌సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని వెల్లడించడంలో విఫలం చెందడం అనేది కాంపిటీషన్ చట్టంలో రెగ్యులేషన్ 5 సెక్షన్ 6, సబ్ సెక్షన్ (2) & కాంబినేషన్ రెగ్యులేషన్స్ సబ్ రెగ్యులేషన్స్(4), (5) ఉల్లంఘనలకు సమానమని సీసీఐ తన ఉత్తర్వుల్లో సూచించింది. అమెజాన్ ప్రతినిధి ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ.. "మేము కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించిన ఉత్తర్వులను సమీక్షిస్తున్నాము, తదుపరి చర్యలకు సంబంధించి తగిన సమయంలో వెల్లడిస్తాము" అని చెప్పారు. 

"చట్టం సెక్షన్ 6(2) కింద అమెజాన్-ఎఫ్‌సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని తెలియజేయడంలో విఫలమైనందుకు చట్టంలోని సెక్షన్ 43ఎ కింద కమిషన్ జరిమానా విధించడానికి అవకాశం ఉంది. జరిమానా అనేది మొత్తం టర్నోవర్ లేదా ఆస్తులలో ఒక శాతం వరకు ఉండే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాల వల్ల కమిషన్ అమెజాన్‌పై రెండు వందల కోట్ల రూపాయల జరిమానా విధిస్తుంది" అని సీసీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్‌ విషయంలో న్యాయపోరాటం సాగిస్తున్న వేళ సీసీఐ నిర్ణయం అమెజాన్‌ను ఇరకాటంలో పెట్టింది. ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో 2019లో అమెజాన్‌ 200 మిలియన్‌ డాలర్ల మేర(49 శాతం) పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. 

(చదవండి: అమెరికా బాట పట్టిన బైజూస్‌.. రూ.30వేల కోట్ల నిధుల సమీకరణ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top