వేసవి ఛాయిస్‌.. బస్సే బిగ్‌బాస్‌ | Bus Segment Set for Strong Summer Growth on Airfare Spike: Rohit Sharma | Sakshi
Sakshi News home page

వేసవి ఛాయిస్‌.. బస్సే బిగ్‌బాస్‌

Mar 28 2026 3:52 AM | Updated on Mar 28 2026 3:52 AM

Bus Segment Set for Strong Summer Growth on Airfare Spike: Rohit Sharma

డిస్కౌంట్‌ 25% జోష్‌ 100% 

కలిసిరానున్న వివాహాలు, ఎన్నికలు  

అభిబస్‌ సీవోవో రోహిత్‌ శర్మ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమాన చార్జీలు పెరగడం, రైళ్ల రద్దీ తదితర అంశాల నేపథ్యంలో వేసవి సీజన్లో బస్సు ప్రయాణాలకు గణనీయంగా డిమాండ్‌ పెరగనున్నట్లు అభిబస్‌ సీవోవో రోహిత్‌ శర్మ చెప్పారు. ఇక పండుగలు, పెళ్లిళ్లు, తమిళనాడు .. పుదుచ్చేరి మొదలైన చోట్ల ఎన్నికలు జరగనుండటం కూడా ప్రయాణాలకి దోహదపడనున్నట్లు ఆయన చెప్పారు. క్రూడాయిల్‌ రేట్ల పెరుగుదలతో విమాన ప్రయాణాలు భారంగా మారడమనేది, పరోక్షంగా బస్సు ఆపరేటర్లకు ప్రయోజనం చేకూర్చనుందని పేర్కొన్నారు.

సాధారణంగా విమానాలు, రైళ్లు, వ్యక్తిగత వాహనాలతో బస్సుల సెగ్మెంట్‌ పోటీ పడాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, ఫ్లయిట్‌ చార్జీలు పెరిగినా, రైల్వే వెయిటింగ్‌ లిస్టులు పెరిగినా.. బస్సులకు మరింత డిమాండ్‌ ఏర్పడుతుందన్నారు. పీక్‌ సీజన్‌లో ప్రయాణికులను ఆకర్షించేందుకు 25 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు శర్మ వివరించారు. హైదరాబాద్‌–విజయవాడలాంటి కీలక రూట్లలో డిమాండ్‌ ఉంటోందని శర్మ చెప్పారు.

పింక్‌ సీట్‌ ఆప్షన్‌లాంటి భద్రతా ఫీచర్ల కారణంగా సోలోగా ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. హోలీ పండుగ వారానికి సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఏకంగా 70 శాతం పెరగ్గా, మహిళల ప్యాసింజర్ల సంఖ్య 80 శాతం పెరిగినట్లు శర్మ వివరించారు. 6.5 లక్షల రూట్లలో 6,200 ఆపరేటర్లకు అగ్రిగేటరుగా వ్యవహరిస్తున్న అభిబస్‌.. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉంది.  

ఉబర్‌తో జట్టు..
ఇంటర్‌సిటీ బస్‌ టికెట్‌ బుకింగ్స్‌ సదుపాయాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేలా ఉబర్‌తో కూడా చేతులు కలిపినట్లు శర్మ చెప్పారు. దీనితో ఉబర్‌ యాప్‌ నుంచే నేరుగా పలు ప్రాంతాలకు బస్‌ టికెట్లను బుక్‌ చేసుకునే వీలుందని ఆయన వివరించారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు. టీఎస్‌ఆర్‌టీసీ, కేఎస్‌ఆర్‌టీసీ మొదలైనవి వీటిలో ఉన్నాయి.

ఇక అష్యూర్డ్‌ ప్రోగ్రాం కింద బస్సుల జాప్యం, రద్దు లాంటి సేవల నాణ్యత లోపాలకు 150% వరకు రీఫండ్‌ ఆఫర్‌ చేస్తున్నామని, ప్రస్తుతం ఈ ప్రోగ్రాంలో సుమారు 360 మంది ఆపరేటర్లు చేరారని శర్మ చెప్పారు. ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ ఇక్సిగోలో భాగమైన అభిబస్‌ ప్లాట్‌ఫాంపై 2026 ఆర్థిక సంవత్సరం క్యూ3లో స్థూల లావాదేవీల విలువ (జీటీవీ) 36% వృద్ధితో రూ. 670.9 కోట్లకు చేరగా, ఆదాయం 47% పెరిగి రూ. 75.5 కోట్లకు చేరింది. ప్రయాణికుల సంఖ్య 33% పెరిగి 67.3 లక్షలకు చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement