
న్యూఢిల్లీ: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బయోడీగ్రేడబుల్ (మట్టిలో కలిసిపోయే) ఆహార పాత్రలకు నాణ్యత ప్రమాణాలను విడుదల చేసింది. ఇటువంటి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ప్లేట్లు, కప్పులు, గిన్నెలు, ఇతర పాత్రలను తయారు చేయడానికి ఆకులు, తొడుగులు వంటి వ్యవసాయ ఉప ఉత్పత్తులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.
ముడి పదార్థాలు, తయారీ పద్ధతులు, పనితీరు, పరిశుభ్రత వంటి అంశాలను ప్రామాణికంగా చేసుకుని ఐఎస్ 18267: 2023 ధ్రువీకరణను బీఐఎస్ జారీ చేస్తుంది. హాట్ ప్రెస్సింగ్, కోల్డ్ ప్రెస్సింగ్, మౌల్డింగ్, స్టిచింగ్ వంటి తయారీ సాంకేతికతలను సైతం బ్యూరో నిర్ధేశిస్తుంది.