
ఐటీ కంపెనీల్లో పని విధానం, వాతావరణం గురించి నిత్యం చర్చ జరుగుతూ ఉంటుంది. టెకీలకు సోమవారాల్లో ఆఫ్‌లు గానీ, వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్లు గానీ ఇవ్వకుండా ఆఫీసులకు రప్పించాలని ఓ సీనియర్ ఉన్నతోద్యోగి చేసిన సూచన తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఛీఫ్ క్వాలిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాగరాజ్ ఎం.సి.. ఐటీ ఉద్యోగులు సోమవారాల్లో తప్పనిసరిగా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని అభిప్రాయపడుతూ ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. పరిశ్రమలో 35 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన సోమవారాల్లో ఆఫీస్ హాజరు అన్నది ఎంత ఆవశ్యకరమో వివరించారు.
సోమవారాల్లో ఆఫీస్ హాజరు ఎందుకు ముఖ్యమంటే..
ఉద్యోగులు సోమవారం రోజున సెలవులు తీసుకోవడం లేదా వర్క్ ఫ్రం హోమ్ కోరడం వల్ల పని వాతావరణానికి కలిగే ఇబ్బందులను నాగరాజ్ వివరించారు. మొదటిది ఉద్యోగుల్లో ఉత్సాహం తగ్గిపోతుంది. మూడు రోజుల వీకెండ్ తర్వాత (సోమవారం తీసుకునే సెలవుతో కలుపుకొని) ఉద్యోగులు ఉత్సాహం లేకుండా వస్తారు.
రెండోది ఉద్యోగులు ప్రాధాన్యతలపై దృష్టి కోల్పోతారు. సోమవారం కార్యాలయంలో ఉండటం వల్ల వారం మొత్తం పనికి దిశ చూపుతుంది. మూడోది ఉద్యోగుల మధ్య సహకారంపై ప్రభావం పడుతుంది. సోమవారం గైర్హాజరు వల్ల టీమ్ డైనమిక్స్ బలహీనమవుతుంది. కాబట్టి అన్ని కంపెనీల్లో ఉన్నతోద్యోగులు తమ సహచరులు సోమవారాల్లో తప్పనిసరిగా ఆఫీస్‌లకు వచ్చేలా ప్రోత్సహించాలని ఆయన సూచిస్తున్నారు.
ఆన్‌లైన్ స్పందనలు
నాగరాజ్ ప్రతిపాదించిన సోమవారం ఆఫీస్ హాజరు సూచనపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది ఈ అభిప్రాయాన్ని పాతదిగా, కఠినంగా అభివర్ణించారు. మంచి పనితీరు అంటే అవుట్‌పుట్, హాజరు కాదంటూ బదులిచ్చారు. ఏఐ, డిజిటల్ టూల్స్ వలన వర్క్ మోడల్స్ మారుతున్నాయి. సోమవారం-శుక్రవారం హాజరు మీద దృష్టి పెట్టడం మైక్రో మేనేజ్‌మెంట్ లా అనిపించిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సోమవారాల్లో సెలవులు ఎందుకు పెడతారు?
రెండు రోజుల వారాంతపు సెలవుల తర్వాత సోమవారం నుంచి మళ్లీ వారం ప్రారంభమవుతుంది. చాలా మంది సెలవు మూడ్‌నుంచి బయటపడి వెంటనే పనిలో నిమగ్నం కాలేరు. అందుకే సోమవారం కూడా సెలవు కావాలని కోరుకుంటారు. వీకెండ్ తర్వాత పని ప్రారంభించేటప్పుడు వచ్చే అసౌకర్య భావనలను సోమవారం బ్లూస్ అంటారు. అలసట, ఆందోళన, నిద్రలేమి, తలనొప్పులు, ఒత్తిడి వీటి లక్షణాలు. ఉద్యోగ అసంతృప్తి, పని ఒత్తిడి, వీకెండ్ అలవాట్లు వీటికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.