breaking news
monday leave
-
టెకీలను ఆరోజు ఆఫీసులకు రప్పించాలంటున్న ఐటీ వెటరన్..
ఐటీ కంపెనీల్లో పని విధానం, వాతావరణం గురించి నిత్యం చర్చ జరుగుతూ ఉంటుంది. టెకీలకు సోమవారాల్లో ఆఫ్‌లు గానీ, వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్లు గానీ ఇవ్వకుండా ఆఫీసులకు రప్పించాలని ఓ సీనియర్ ఉన్నతోద్యోగి చేసిన సూచన తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఛీఫ్ క్వాలిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాగరాజ్ ఎం.సి.. ఐటీ ఉద్యోగులు సోమవారాల్లో తప్పనిసరిగా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని అభిప్రాయపడుతూ ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. పరిశ్రమలో 35 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన సోమవారాల్లో ఆఫీస్ హాజరు అన్నది ఎంత ఆవశ్యకరమో వివరించారు.సోమవారాల్లో ఆఫీస్ హాజరు ఎందుకు ముఖ్యమంటే..ఉద్యోగులు సోమవారం రోజున సెలవులు తీసుకోవడం లేదా వర్క్ ఫ్రం హోమ్ కోరడం వల్ల పని వాతావరణానికి కలిగే ఇబ్బందులను నాగరాజ్ వివరించారు. మొదటిది ఉద్యోగుల్లో ఉత్సాహం తగ్గిపోతుంది. మూడు రోజుల వీకెండ్ తర్వాత (సోమవారం తీసుకునే సెలవుతో కలుపుకొని) ఉద్యోగులు ఉత్సాహం లేకుండా వస్తారు. రెండోది ఉద్యోగులు ప్రాధాన్యతలపై దృష్టి కోల్పోతారు. సోమవారం కార్యాలయంలో ఉండటం వల్ల వారం మొత్తం పనికి దిశ చూపుతుంది. మూడోది ఉద్యోగుల మధ్య సహకారంపై ప్రభావం పడుతుంది. సోమవారం గైర్హాజరు వల్ల టీమ్ డైనమిక్స్ బలహీనమవుతుంది. కాబట్టి అన్ని కంపెనీల్లో ఉన్నతోద్యోగులు తమ సహచరులు సోమవారాల్లో తప్పనిసరిగా ఆఫీస్‌లకు వచ్చేలా ప్రోత్సహించాలని ఆయన సూచిస్తున్నారు.ఆన్లైన్ స్పందనలునాగరాజ్ ప్రతిపాదించిన సోమవారం ఆఫీస్ హాజరు సూచనపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది ఈ అభిప్రాయాన్ని పాతదిగా, కఠినంగా అభివర్ణించారు. మంచి పనితీరు అంటే అవుట్‌పుట్, హాజరు కాదంటూ బదులిచ్చారు. ఏఐ, డిజిటల్ టూల్స్ వలన వర్క్ మోడల్స్ మారుతున్నాయి. సోమవారం-శుక్రవారం హాజరు మీద దృష్టి పెట్టడం మైక్రో మేనేజ్మెంట్ లా అనిపించిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.సోమవారాల్లో సెలవులు ఎందుకు పెడతారు?రెండు రోజుల వారాంతపు సెలవుల తర్వాత సోమవారం నుంచి మళ్లీ వారం ప్రారంభమవుతుంది. చాలా మంది సెలవు మూడ్‌నుంచి బయటపడి వెంటనే పనిలో నిమగ్నం కాలేరు. అందుకే సోమవారం కూడా సెలవు కావాలని కోరుకుంటారు. వీకెండ్ తర్వాత పని ప్రారంభించేటప్పుడు వచ్చే అసౌకర్య భావనలను సోమవారం బ్లూస్ అంటారు. అలసట, ఆందోళన, నిద్రలేమి, తలనొప్పులు, ఒత్తిడి వీటి లక్షణాలు. ఉద్యోగ అసంతృప్తి, పని ఒత్తిడి, వీకెండ్ అలవాట్లు వీటికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: HCLTech: మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా.. -
భోజనంలో విషం కలుపుతాం
సోమవారం సెలవు ఇవ్వాలని డిమాండ్ నోటీసుబోర్డుపై హెచ్ఎంకు హెచ్చరికలు జోగిపేట పాఠశాలలో బీభత్సం.. రికార్డులు చోరీ సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్ఐ, ఎంఈఓ జోగిపేట: హెచ్ఎం భిక్షపతి సార్.. సోమవారం సెలవు ఇవ్వకపోతే అక్షయ పాత్ర భోజనంలో విషం కలుపుతామని నోటీసు బోర్డుపై రాసి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. అంతే కాకుండా హెచ్ఎంని ఉద్దేశించి బోర్డుపై చాక్‌పీస్‌తో బూతులు రాశారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో అల్లరిమూకల ఆగడాలు ఎక్కువయ్యాయి. చేనేత సహకార సంఘం సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కొన్ని సంవత్సరాలుగా బాలుర ఉన్నత పాఠశాల తరగతులను నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు ఉండడంతో రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోకి చొరబడి నానా బీభత్సవం సృష్టించారు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే సిబ్బంది పాఠశాలకు రాగా ఈ విషయం బయటపడింది. నోటీసు బోర్డుపై రాసిన వాటిని విద్యార్థులతో తుడిపి వేయించారు. పాఠశాల ఆవరణలోని ఉర్దూ మీడియం తరగతి గదుల్లో బీరు సీసాలను పగులగొట్టి మూడు కల్లు సీసాలను వరండాలో వదిలివెళ్లారు. పాఠశాలలోని కార్యాలయం గది తాళాలు పగులగొట్టి విద్యార్థులకు సంబంధించిన రికార్డులను ఎత్తుకెళ్లారు. టీచింగ్ సిలబస్ పుస్తకాలు, పిల్లల ప్రాజెక్టు నోట్‌పుస్తకాలు, పరీక్షా పత్రాలు లెస్సన్ ప్లాన్లు, ప్రోగ్రెస్ కార్డులు, మరో గదిలో టేబుళ్లపై విద్యార్థులు పెట్టుకున్న నోటు బుక్కులను దగ్ధం చేశారు. గతంలో ఎన్నిసార్లు దొంగతనాలు జరిగినా సంబంధిత శాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇన్చార్జి హెచ్ఎం సతీష్‌కుమార్ ఈ విషయమై పోలీసులకు, ఎంఈఓకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ సైదోద్దిన్, ఎంఈఓ కృష్ణలు వచ్చి వివరాలు సేకరించారు. స్థానికులే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమాన వ్యక్తం చేశారు. అయితే హెచ్ఎంపై కోపంతో రాతలు రాసి ఉండడంతో విద్యార్థులే ఈ పని చేసి ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే 11 కంప్యూటర్ల చోరీ మూడు నెలల క్రితమే బాలుర ఉన్నత పాఠశాలలోనే గుర్తు తెలియని దొంగలు చొరబడి గది తాళాలు పగులగొట్టి 11 కంప్యూటర్లు, హోండా కంపెనీకి చెందిన జనరేటర్లను ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ కేసులో విచారణనూ స్థానిక పోలీసులు చేపట్టడం లేదన్న విమర్శలున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పాఠశాలకు రక్షణ లేకుంటే ఎలా అని పలువురు ప్రశ్నించారు.