
ఐటీ పరిశ్రమలో ఏఐ పేరు చెబితేనే ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. కారణం ఎడాపెడా లేఆఫ్‌లు. ఒక కంపెనీ ఏఐపై దృష్టి పెట్టిందంటేనే ఇక ఆ సంస్థలో మానవ ఉద్యోగాలకు మూడినట్టేనన్న చర్చ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్‌సీఎల్ ఉద్యోగులకు మంచి మాట చెప్పారు ఆ కంపెనీ చైర్ పర్సన్ రోష్ని నాడార్.
ఇటీవల జరిగిన హెచ్‌సీఎల్‌టెక్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్‌పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోతలపై పెరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు. తాము మానవ ప్రతిభను మరింత పెంచడానికే తప్ప దాన్ని భర్తీ చేయడం కోసం ఏఐని వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఆ రకంగా ఉద్యోగాల తొలగింపు కాకుండా వాటి సృష్టిపై కంపెనీ దృష్టి సారించిందని ఆమె వాటాదారులకు భరోసా ఇచ్చారు.
బాధ్యతాయుతమైన వ్యూహానికి కట్టుబడి ఉన్నాం
మానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐని కో పైలట్ గా ప్రవేశపెడుతున్నామని, వాటి స్థానంలో కాదని ఆమె అన్నారు. ‘కొన్ని ఉద్యోగాల్లో మార్పులు ఉండొచ్చు కానీ, అధిక విలువ పనులను చేపట్టడానికి ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంపైనే మా దృష్టి ఉంది. ఉద్యోగాల కోత కంటే వాటి పెరుగుదల, ఉద్యోగ పరివర్తనకు ప్రాధాన్యమిచ్చే బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణ వ్యూహానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని రోష్ని నాడార్ సపష్టం చేశారు.
ఐటీ రంగంలో నియామకాలు మందకొడిగా సాగుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో సిబ్బంది నికర చేర్పులు తక్కువగా ఉన్నాయి. ఇది నియామకంలో మరింత జాగ్రత్తగా విధానాన్ని సూచిస్తుంది. కొన్ని కంపెనీలు స్వల్ప లాభాలను నమోదు చేయగా, మొత్తం ట్రెండ్ ప్రకారం నియామకాలు చల్లబడ్డాయి.
జూన్ తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ 1,984 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. గత త్రైమాసికంలో 2,23,420గా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆ త్రైమాసికంలో 2,23,151కి తగ్గింది. మార్చిలో 13 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు జూనలో 12.8 శాతానికి తగ్గింది.
ఇదీ చదవండి: విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్