పెద్దాయన పబ్లిసిటి పిచ్చి.. తిక్క కుదిర్చిన కన్సుమర్‌ కోర్టు

Bengaluru Consumer Court Delivered Interesting Verdict On 40 Paisa loss Case - Sakshi

బెంగళూరు కన్సుమర్‌ కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ఆసక్తికరంగా మారింది. వినియోగదారుల హక్కులు, వ్యాపార సంస్థల బాధ్యతలను మరోసారి చర్చకు పెట్టింది. కేవలం నలభై పైసల కోసం జరిగిన విచారణ చివరకు మూలనపడిన ఓ కొత్త సర్క్యులర్‌ని బయటకు వెలికి తీసింది.

బెంగళూరుకు చెందిన మూర్తి అనే సీనియర్‌ సిటిజన్‌ నగరంలో ఉన్న ఎంపైర్‌ అనే హోటల్‌కి వెళ్లి టేక్‌ అవేలో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. బిల్లు రూ. 264.60లు అవగా హోటల్‌ వాళ్లు అతని నుంచి రూ. 265లు తీసుకున్నారు. హోటల్‌ యాజమాన్యం తన నుంచి అన్యాయంగా 40 పైసలు దోచుకున్నారంటూ కన్సుమర్‌ కోర్టును 2021 జనవరిలో ఆశ్రయించాడు. దీనికి పరిహారంగా ఒక రూపాయి నష్టపరిహారం ఇప్పించాలంటూ కోర్టును కోరాడు.

ఈ కేసుకి సంబంధించి హోటల్‌ యాజమాన్యం ఇద్దరు లాయర్లను నియమించుకోగా మూర్తి తానే వాదనలు వినిపించాడు. ఎంఆర్‌పీ మీద అదనంగా డబ్బులు ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించాడు. జీఎస్‌టీ చట్టం 2017లోని సెక‌్షన్‌ 170 ప్రకారం.. కస్టమర​ నుంచి ఎక్కువ సొమ్ము తీసుకోలేదని.. అధికంగా తీసుకున్న 40 పైసలు కూడా ట్యాక్స్‌లో భాగమేనంటూ హోటల్‌ తరఫున న్యాయవాదులు వాదించారు. 

ఈ కేసులో ఒకరు నలభై పైసలు నష్టపోగా.. మరొకరు దోషిగా తేలితే జరిమానాగా ఒక రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎవ్వరూ ఈ కేసులో వెనక్కి తగ్గకుండా తమ వాదనలు కోర్టులో వినిపిస్తూ వచ్చారు. ఈ కేసులో తీర్పు వెలువరించేందుకు వినియోగదారులకు సంబంధించిన అన్ని చట్టాలను, నిబంధనలను న్యాయమూర్తి చదవాల్సి వచ్చింది.

చివరకు ఓ సర్క్యులర్‌ ఆధారంగా చేసుకుని న్యాయమూర్తి తన తీర్పును వెలువరించారు. కేసు పెట్టిన మూర్తి యాభై పైసల కంటే తక్కువ నష్టపోయినందున కేసును కొట్టి వేసింది. ఇదే సమయంలో కోర్టు సమయాన్ని పబ్లిసిటీ కోసం వృధా చేసినందుకు రూ. 4000 జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఏడాదికి పైగా పలు దఫాలుగా విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తికి వినియోగదారుల హక్కులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో ఓ పాయింట్‌ దొరికింది. దాని ప్రకారం... ఎవరైనా యాభై పైసల కంటే తక్కువ నష్టపోతే దాన్ని ఇగ్నోర్‌ చేయవచ్చని పేర్కొంది. కానీ యాభై పైసలు అంతకంటే ఎక్కువ నష్టపోయిన పక్షంలో చట్ట ప్రకారం అతనికి న్యాయం జరగాల్సిందేనంటూ స్పష్టం చేసి ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top