Covid Crisis : ‘శంషాబాద్‌’ నుంచి కేంద్రం అవుట్‌

Airport Authority Of India Planning To Sold Out Its Stake In Bangalore And Hyderabad Airports - Sakshi

బెంగళూరు కెంపగౌడలోనూ వాటాల విక్రయం

పెట్టుబడులు ఉపసంహరణకు రంగం సిద్ధం  

హైదరాబాద్‌: పరిస్థితులు ఎలా ఉన్నా  పెట్టుబడుల ఉపసంహారణ పట్ల కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. నలువైపులా విమర్శలు వస్తోన్నా... ముందుకే వెళ్తోంది. తాజాగా శంషాబాద్‌తో పాటు బెంగళూరులోని కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ఉన్న వాటాల విక్రయానికి ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సిద్ధమైంది. 

ఏఏఐ వాటా
సిలిక్యాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన బెంగళూరు, హైటెక్‌ సిటీ హైదరాబాద్‌లలో ఉన్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వాటాలు విక్రయించేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సిద్ధమైంది. ఈ రెండు ఎయిర్‌పోర్టుల్లో ఏఏఐకి 13 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ వాటాను కూడా అమ్మేసి ఎయిర్‌పోర్టుల నిర్వాహాణ వ్యాపారం నుంచి నెమ్మదిగా పక్కకు తప్పుకుంటోంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో తమ వాటా విలువను మదింపు పనుల్లో ఏఏఐ బిజీగా ఉంది. 

అప్పులు తీర్చేందుకు
ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ కారణంగా వెయ్యి కోట్ల నష్టం వచ్చినట్టు ఏఏఐ ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టుల్లో వాటాలు అమ్మకం ద్వారా నిధులు సమీకరించి అప్పులు తీర్చే పనిలో ఏఏఊ ఉంది. ముందుగా బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉన్న వాటాలు విక్రయించి తర్వాత ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల నిర్వహాణ నుంచి కూడా తప్పుకోనుంది.

ప్రభుత్వ వాటా 13 శాతమే
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్‌ గ్రూపు ప్రధాన వాటా దారుగా ఉంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ కంపెనీ 63 శాతం వాటాతో మెజార్టీ షేర్‌ హోల్డర్‌గా ఉంది. కాగా  మలేషియన్‌ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్‌ సంస్థకి  11 శాతం వాటాలు ఉన్నాయి. మొత్తంగా 74 శాతం వాటాలు ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉన్నాయి. కేవలం  ఏఏఐ 13 శాతం, తెలంగాణ ప్రభుత్వం 13 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. తాజాగా ఏఏఐ కూడా పెట్టుబడులు ఉపసంహరిస్తుండటంతో శంషాబాద్‌లో ప్రభుత్వ వాటా కేవలం 13 శాతానికే పరిమితం కానుంది. బెంగళూరు విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 

చదవండి : రైలు ప్రయాణికులకు ఐఆర్​సీటీసీ శుభవార్త!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top