కొనుగోలుదారుల‌కు భారీ షాక్‌!! పెరగనున్న ఇళ్ల ధరలు..రీజనేంటి?ఎవరికి దెబ్బ!

55percent Cii anarock Survey Expect Hike In Housing Prices In 2022 - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలే కాదు..కొనుగోలుదారులూ అభిప్రాయపడుతున్నారు. నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌.. సీఐఐతో కలసి వినియోగదారుల అభిరుచులపై ఒక సర్వే నిర్వహించింది.

2021 జూలై నుంచి డిసెంబర్‌ మధ్య ఈ సర్వే జరిగింది. ఈ వివరాలను అనరాక్‌ వెల్లడించింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 5,210 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిర్మాణ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో ఇళ్ల ధరలు పెరుగుతాయని అంచనాతో ఉన్నట్టు 55 శాతం మంది చెప్పారు. అయితే ధరలు పెరగడం 10 శాతం లోపు ఉంటే డిమాండ్‌పై మోస్తరు నుంచి, తక్కువ ప్రభావమే ఉంటుందని.. 10 శాతానికి మించి పెరిగితే మాత్రం కొనుగోళ్ల సెంటిమెంట్‌పై గట్టి ప్రభావమే చూపిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. 

రియల్‌ ఎస్టేట్‌ను ఒక ఆస్తిగా పరిగణిస్తున్నవారి సంఖ్య 2021 తొలి ఆరు నెలల్లో 54 శాతంగా ఉండగా, ద్వితీయ ఆరు నెలల్లో 57 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ద్వితీయ భాగంలో వడ్డీ రేట్లు పెరగడం కొనుగోళ్ల వ్యయాన్ని పెంచుతుందన్న అంచనా వ్యక్తం అయింది. ఇంటి యజమానులు కావాలన్న ధోరణిలోనూ పెరగుదల కనిపించింది. 63 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్‌ ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్‌ 2021 ద్వితీయ ఆరు నెలల్లో 40% నుంచి 27 శాతానికి తగ్గింది. 32% మంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top