అ(త)ప్పు చేయకూడదంటే.... | 4 plans to avoid falling into debt | Sakshi
Sakshi News home page

అ(త)ప్పు చేయకూడదంటే....

May 1 2025 3:54 PM | Updated on May 1 2025 4:01 PM

4 plans to avoid falling into debt

కష్టాలు చెప్పి చెప్పి రావు... 
కష్టాలు చుట్టాల్లా వచ్చి పలకరిస్తాయి...
పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదురా నాయనా...
ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయో...
మనం తరచుగా వినే మాటలే ఇవి.

ఒక్కొక్కరి కష్టాలు ఒక్కో రకంగా ఉండొచ్చు.. ఇతరత్రా కష్టాలని కాసేపు పక్కన పెట్టేసి... ఆర్ధిక కష్టాల గురించి ఈ ఆర్టికల్ లో మాట్లాడుకుందాం... మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందనేది వాస్తవం. మరి ఈ డబ్బుని ఎంత పద్ధతిగా సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అంత సురక్షితంగా ఉండగలుగుతాం. ఇలా ఉండాలంటే ప్రతి వ్యక్తికీ సరైన ఆర్ధిక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకపోతే జీవితం అధోగతి పాలవుతుందనేది నిర్వివాదాంశం. కాబట్టి మీరు సంపాదన మొదలు పెట్టిన తొలినాళ్లలోనే పక్కా పకడ్బందీ ప్రణాళికతో సాగాలి. ఇందుకు ప్లాన్-1, ప్లాన్-2, ప్లాన్-3, ప్లాన్-4 అనే అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి.

ప్లాన్-1 చేతిలో ఎప్పుడూ తగినంత నగదు ఉంచుకోవాలి. 

ఉదాహరణకు: మీకు నెలకు అన్ని ఖర్చులూ పోగా సగటున రూ. 2000 అవసరమవుతోంది అనుకోండి.  మీ చేతిలో దానికి అయిదు రెట్లు... అంటే రూ.10,000 ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అది నగదు రూపంలోనైనా సరే.. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లోనైనా సరే. ఆరోగ్యపరంగా కావచ్చు... ఏదైనా ఫంక్షన్స్ రావొచ్చు.. అప్పటికప్పుడు అత్యాసర పని మీద  ఏదైనా ఊరు వెళ్లాల్సి రావొచ్చు.. కారణం ఏదైతేనేం... చేతిలో కొంత నగదు అట్టేపెట్టుకోవడం ప్లాన్-1 లో ప్రథమ లక్షణం. ఇలా చేయడం వల్ల అప్పుకు ఎవరి దగ్గరికీ పరిగెత్తాల్సిన పరిస్థితి తలెత్తదు.

ప్లాన్-2 బ్యాంకులో డిపాజిట్లు తప్పనిసరి. 

మీరు ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు చేసే రికరింగ్ డిపాజిట్ అయినా.. కొంచెం పెద్ద మొత్తంలో దాచుకున్న ఫిక్సడ్ డిపాజిట్ అయినా... మీకు సమయానికి ఉపయోగపడుతుంది. అత్యవసర సందర్భాల్లో ఎవరి దగ్గరా చెయ్యి చాచనక్కర్లేకుండా .. ఈ డిపాజిట్లను విత్ డ్రా చేసుకుని అవసరాన్ని నెరవేర్చుకోవచ్చు. మరో విషయం: ఈ ఆర్డీ, ఎఫ్డీ లను మధ్యలోనే విత్ డ్రా చేయడం వల్ల మీరు ఆశించిన వడ్డీ రాదు, కొన్ని సందర్భాల్లో మీరు పెనాల్టీ కూడా కట్టాల్సి రావచ్చు.  అయినప్పటికీ... మీరు అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడదు. అదే సమయంలో ఒకర్ని సాయం చేయమని అడిగే పరిస్థితి తలెత్తదు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆత్మాభిమానం దెబ్బ తినదు. ఒకవేళ మీరు చెప్పిన టైం కి బాకీ తీర్చలేకపోతే అవతలి వ్యక్తులు అనే మాటలు పడాల్సిన అవసరం ఉండదు. అప్పిచ్చినవాడు ఎప్పుడు మీద పడతాడో అని నిత్యం నలిగిపోతూ బతకక్కర్లేదు. కాబట్టి... ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్లాన్-2 అనేది తప్పనిసరి.

ప్లాన్-3 లిక్విడ్ పెట్టుబడులు
ప్రతి వ్యక్తి ఆర్ధిక జీవితంలోనూ ఇదొక అత్యంత కీలకాంశం. ఈ మూడో మార్గంలో మిమ్మల్ని ఆదుకునేది మీరు చేసే చర పెట్టుబడులే. అవును.. ఇది నిజమే.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బంగారాల్లో చేసిన పెట్టుబడుల్ని మూడో అంచె మిత్రులుగా చెప్పుకోవచ్చు. ఈ మూడింటిలోనూ పెట్టుబడి పెట్టడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జోలికి పోకండి. కేవలం పెట్టుబడులపైనే దృష్టి పెట్టండి.

షేర్ల విషయానికొస్తే... తప్పనిసరిగా ఫండమెంటల్స్ బాగుండే ప్రధాన కంపెనీలనే ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల... పెద్ద కంపెనీల షేర్లు మార్కెట్ ఒడుదొడుకుల్లో క్షీణించినప్పటికీ... మళ్ళీ సత్వరమే కోలుకునే సత్తా వీటికి ఉంటుంది. కాబట్టి భయపడిపోయి మార్కెట్ కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. పైగా మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బాగా దూసుకెళ్ళేవి కూడా ఈ షేర్లే. మీరు ఎంచుకునే షేర్లను బట్టే మీకొచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో కనీసం మూడేళ్లకు తగ్గకుండా.. దీర్ఘకాలిక దృక్పథంతో చేసే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు కూడా అవసరానికి ఆదుకునే లక్షణం ఉంది.  (వివరాలు మరో ఆర్టికల్ లో చర్చిద్దాం).

ఇక బంగారంలో పెట్టుబడి మూడోది. ఈవేళ బంగారం ధర లక్షకు చేరుకుంది. మీకు తెలియకుండానే అప్పుడో కొంత.. ఇప్పుడో కొంత చొప్పున బంగారం కొంటూ వచ్చినా.. లేదంటే.. గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెడుతూ వచ్చినా.. మీకు మంచి ప్రయోజనమే ఉంటుంది. తాకట్టు పెట్టుకుంటే దాని విలువలో దాదాపు 80% అప్పు దొరుకుతుంది. అది కూడా తక్కువ వడ్డీకే. మళ్ళీ మీరు శక్తియుక్తులు కూడదీసుకున్నాక దాన్ని విడిపించుకోవచ్చు.

పై మూడు పెట్టుబడుల్లోనూ ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే... మన అవసరాలకు తక్షణమే పెద్ద మొత్తంలో నగదు కావాల్సి వచ్చినపుడు ఈ మూడూ ఆదుకుంటాయి. అంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, బంగారాల్లో పెట్టుబడులు సమయానికి అక్కరకొస్తాయన్న మాట. ఇవన్నీ తక్షణ లిక్విడిటీ ఉన్న పెట్టుబడులు.

ప్లాన్-4 స్థిరాస్తులపై పెట్టుబడి
భూములు, ఆస్తులు, భవనాలపై పెట్టుబడులను ఈ కేటగిరీలోకి తీసుకోవచ్చు. ఇవి ఖరీదైనవే కావచ్చు..వీటిని సమకూర్చుకోవడం అందరివల్లా కాకపోవచ్చు. కానీ ప్రతి మనిషీ తన జీవితంలో ఒక సొంత ఇల్లు సమకూర్చుకోవాలి అనుకోవడం సహజమే కదా..మరికొందరు రూపాయి రూపాయి కూడబెట్టి ఎంతో కొంత భూమి కొనుక్కుంటారు. అలా సమకూర్చుకున్న సొమ్మే ఆపదలో ఆదుకుంటుంది (ఇల్లు అమ్ముకోమని కాదు. ఇదొక మార్గం కూడా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం).

ముగింపు 
అనుకోకుండా తలెత్తే ఖర్చులను తట్టుకోవడానికి ప్రతి మనిషి జీవితానికీ నాలుగు దశల ఆర్ధిక ప్రణాళికలు ఉండాలి. మొదటిది చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడితే..రెండోది ఇంకొంచెం పెద్ద సమస్యలను దీటుగా గట్టెక్కడానికి దోహదపడుతుంది. మూడోది ఎలాంటి పరిస్థితులనుంచి అయినా బయటపడే అవకాశాన్ని కల్పిస్తుంది.
పీకల మీదకి వచ్చి... విధిలేని పరిస్థితుల్లో తోడ్పడేది నాలుగోది. ఈ నాలుగు పాటించిన వాళ్ళ జీవితం నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేసిన వారి జీవితం నిత్యం యాతనతో సతమతమవుతూనే ఉంటుంది. నిర్ణయం మీచేతుల్లోనే ఉంది.

-బెహరా శ్రీనివాస రావు, ఆర్ధిక నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement