రోడ్డు ప్రమాదంలో పది నెలల బాబు మృతి
అశ్వాపురం: మండలంలోని జగ్గారం శివారులో కారు బోల్తా పడిన ఘటనలో గాయపడిన 10 నెలల బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మణుగూరుకు చెందిన సింగరేణి కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డు బండిరమేష్ కుటుంబసభ్యులు కారులో ఈ నెల 23న సాయంత్రం మణుగూరు వెళ్తుండగా జగ్గారం వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా, రమేష్ కుమారుడు పది నెలల బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడికి ఏడాది కూడా నిండకముందే మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి మృతి
చండ్రుగొండ: మండలంలోని బాల్యతండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాలు.. బాల్యతండాకు చెందిన ధరావత్ సక్రు(40) ఈనెల 23వ తేదీన పత్తి తీసేందుకు భార్య లలితతో కలిసి వెళ్లాడు. భార్య ఇంటికి వచ్చాక చేనులోనే పురుగుల మందు తాగిన ఆయనను కుటుంబీకులు చండ్రుగొండ, కొత్తగూడెంలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం తెల్ల వారుజామున మృతి చెందాడు. ఘటనపై సక్రు కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయకుమారి తెలిపారు.


