విత్తన నాణ్యతపై బాధితుల అనుమానాలు ఆరెకరాల్లో రాని కంకులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
అశ్వారావుపేటరూరల్: ఆరుగాలం శ్రమించి మొక్కజొన్న పంటను సాగు చేసిన ఇద్దరు గిరిజన రైతులను విత్తనాల రూపంలో ముంచాయి. వేలాది రూపాయాల వ్యయంతో విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేయగా.. ఆశించిన స్థాయిలో పంట ఎదగలేదు. దీంతో బాధిత రైతులకు నష్టం వాటిల్లిన ఘటన మంగళవారం మండలంలో వెలుగు చూసింది.
ఆరెకరాల్లో సాగు..
అశ్వారావుపేట మండలంలోని గాండ్లగూడేనికి చెందిన తేజవతు చంటిబాబు, భూక్యా చెన్నమ్మ అనే రైతులు గ్రామ సమీపంలోని భూములను కౌలుకు తీసుకుని వేర్వేరుగా మొత్తం ఆరెకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. అయితే మొక్కజొన్న విత్తనాలను ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని పేరంపేట ఓ వ్యాపారి వద్ద ఒక ఎకరానికి రూ.2వేల చొప్పున కొనుగోలు చేయగా, పంట సాగు నుంచి ఇప్పటి దాకా విత్తనాలు, మందులు, కూలీలు, కౌలు ఖర్చులతో పాటు ఇతర ఖర్చులు కలిపి ఎకరానికి రూ.40వేల పెట్టుబడి పెట్టినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు.
45 రోజులు తర్వాత వెలుగులోకి..
కాగా, పొలంలో విత్తనాలు నాటి 45 రోజులు గడుస్తున్నా పంట ఆశించిన స్థాయిలో ఎదగకపోగా, మొక్కల పెరుగుదల కూడా ఆగిపోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడువు దాటినా మొక్కలకు కంకులు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో బాధితులు సదరు వ్యాపారికు సమాచారం ఇవ్వగా మంగళవారం పొలాలను పరిశీలించి ఇంకొన్ని రోజులు వేచి చూడాలని సమాధానం చెప్పినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు నాసిరకం కావడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, తక్షణమే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
రైతులను ముంచిన మొక్కజొన్న విత్తనాలు!?


