ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా 54 జంటలు పాల్గొనగా, అర్చకులు వ్రతం చేయించారు. అలాగే, సాయంత్రం ఆలయంలోని కోనేరు వద్ద కార్తీక దీపోత్సవం, గంగా హారతి నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరు జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సును
ఢీకొట్టిన కారు
పలువురికి గాయాలు
మణుగూరు టౌన్: మండలంలోని అశోక్‌నగర్ సమీ పాన సాయిబాబా ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి స్వల్పగాయాలు, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల, కరీంనగర్‌లో బీటెక్ చదువుతున్న విద్యార్థులు భద్రాచలం విహారయాత్ర ముగించుకుని మంగళవారం కారులో వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈక్రమాన మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లెవెలుగు బస్సును, సాయిబాబా ఆలయం సమీపాన రాంగ్ రూట్‌లో వచ్చిన కారు ఢీకొట్టింది. ఘటనలో కారు ముందుభాగం నుజునుజ్జవగా, ఎనిమిది మంది విద్యార్థుల్లో ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యా యి. వీరిని మణుగూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఒక మహిళను భద్రాచలం ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉన్న డ్రైవర్ సంజయ్‌ను కొత్తగూడెం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నగేశ్ తెలిపారు.
భద్రాచలంలో
‘పీఎం రాహత్’
మహిళకు రూ.22 వేల విలువైన వైద్యం
భద్రాచలంఅర్బన్: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత తక్షణ చికిత్స కోసం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం రాహత్’పథకం ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఒకరికి చికిత్స అందింది. ఈనెల 12వ తేదీన భద్రాచలం పాత మార్కెట్ వద్ద పారిశుద్ధ్య కార్మికురాలు సామ్రాజ్యంను డీసీఎం ఢీకొట్టగా ఆమె చేతికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఎడమ చేతిని మోచేయి వరకు ఏరియా ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. సహజంగా ఇలాంటి కేసుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా క్లెయిమ్ చేస్తారు. అయితే, కేంద్రంప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం ద్వారా క్లెయియ్ చేయగా, రూ.22వేల విలువైన వైద్యం ఉచితంగా అందినట్లయింది. ఈ సందర్భంగా మంగళవారం ఆస్పత్రిలో బాధితురాలిని సీఐ ఎస్.రాజు, డీఆర్‌ఎం బాలాజీ, ఆరోగ్యశ్రీ మిత్ర సుధాకర్ పరామర్శించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం ఉచితంగా అందుతుందని, చికిత్స ఖర్చును కలెక్టర్ లాగిన్ నుంచి ఆస్పత్రులకు చెల్లిస్తారని తెలిపారు.
జర్నలిస్ట్ పేరిట
బెదిరించిన వ్యక్తిపై కేసు
మధిర: గ్యాస్ ఏజెన్సీ యజమానిని బెదిరించి రూ.50వేలు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మధిర పట్టణ సీఐ డి.రమేష్ తెలిపారు. మండలంలోని దెందుకూరుకు చెందిన కందుకూరి నరేష్ తాను జర్నలిస్టునంటూ మధిరలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి రెగ్యులేటర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ సిబ్బందితో గొడవకు దిగాడు. ఆపై కంప్యూటర్ ఆపరేటర్‌తో పాటు యజమానికి ఫోన్ చేయించి రూ.50వేలు ఇవ్వాలని, లేనిపక్షంలో తప్పుడు ప్రచారం చేస్తానని బెదిరించాడని ఫిర్యాదు అందడంతో నరేష్‌పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.


