భద్రాచలంఅర్బన్: రెండు వేర్వేరు ఘటనల్లో ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 9.7 కేజీల గంజాయిని పట్టణంలోని కూనవరం రోడ్డులో ఆదివారం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీహరిరావు కూనవరం రోడ్డులో వాహనాలు తనిఖీ చేపట్టారు. నంబర్ ప్లేట్ లేకుండా వస్తున్న స్కూటీ నీ ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 5.2 కేజీల గంజా యి దొరికింది. తరలిస్తున్న వారు హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ ఖాన్, షేక్ షోయబ్‌గా తేలింది. మరో ఘటనలో స్కూటీపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 4.5 కేజీల గంజాయి లభించింది. తరలిస్తున్న వారు మోహిత్‌కుమార్, ఆనంద్ మిశ్రాగా తేలింది. ఆనంద్ మిశ్రా పరారీలో ఉన్నాడని, పట్టుబడిన వారంతా హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, గంజాయిని ఒడిశా రాష్ట్రం కలిమెల, మోటు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా దొరికారని, మొత్తం 9.7 కేజీల గంజాయి, రెండు స్కూటీలు, రెండు మొబైళ్లను సీజ్ చేశామని, గంజాయి విలువ రూ.6.60 లక్షలు ఉంటుందని సీఐ శ్రీహరిరావు తెలిపారు. తనిఖీల్లో హెడ్‌కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుల్ శివకుమార్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆటో, ద్విచక్రవాహనం ఢీ..
ఒకరు మృతి, మరో ముగ్గురికి గాయాలు
అశ్వారావుపేటరూరల్: ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని నారంవారిగూడేనికి చెందిన భోగి నాగేశ్వరరావు (38), ఆయన భార్య వెంకటలక్ష్మి, బావమరిది మనుగొండ శ్రీను, ఆయన ఆరేళ్ల కూతురు పూరి కలిసి ద్విచక్రవాహనంపై ఆదివారం దమ్మపేట మండలం రంగువారిగూడెంలోని శ్రీముత్యాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో మండలంలోని నారంవారిగూడెంకాలనీ వద్ద ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శ్రీను కాలు, చేయి విరిగగా చిన్నారి పూరి కాలు విరిగింది. వెంకటలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అశ్వారావుపేట ఆస్పత్రికి అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ యయాతిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


